AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

అమెరికా ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరు స్నేహితురాళ్ల పార్థివదేహాలు రాక: ఒకేచోట అంత్యక్రియలు!

అమెరికాలోని కాలిఫోర్నియాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మహబూబాబాద్ జిల్లా యువతులు మేఘన, భావనల మృతదేహాలు ఎట్టకేలకు శనివారం స్వగ్రామాలకు చేరుకున్నాయి. గత ఏడాది డిసెంబర్ 29న జరిగిన ఈ దుర్ఘటన తర్వాత, దాదాపు 14 రోజుల సుదీర్ఘ నిరీక్షణ అనంతరం వారి పార్థివదేహాలు ఇళ్లకు చేరాయి. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లిన తమ బిడ్డలు విగతజీవులుగా తిరిగి రావడంతో తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి, దీంతో గార్ల మండలంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.

పుల్ల ఖండం గ్రామానికి చెందిన మేఘన (25), ముల్కనూరుకు చెందిన కడియాల భావన (25) చిన్నప్పటి నుండి అత్యంత సన్నిహిత స్నేహితులు. చదువులోనూ, కెరీర్‌లోనూ ఒకరికొకరు తోడుగా ఉంటూ కలిసి అమెరికా వెళ్లారు. మేఘన తండ్రి నాగేశ్వరరావు స్థానికంగా మీసేవ కేంద్రం నడుపుతుండగా, భావన తండ్రి కోటేశ్వరరావు ముల్కనూరు ఉప సర్పంచ్‌గా సేవలందిస్తున్నారు. అల్లారుముద్దుగా పెరిగిన తమ కుమార్తెలు ఒక్కసారిగా లోకాన్ని విడిచిపోవడాన్ని ఆ కుటుంబాలు జీర్ణించుకోలేకపోతున్నాయి.

జీవితాంతం స్నేహితులుగా ఉన్న వీరిద్దరి జ్ఞాపకార్థం, కుటుంబ సభ్యులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. మేఘన, భావనల అంత్యక్రియలను ముల్కనూరు గ్రామంలోనే ఒకే చోట నిర్వహించాలని నిశ్చయించారు. చిన్ననాటి నుండి కలిసి పెరిగిన ఆ స్నేహితురాళ్లు చివరి ప్రయాణంలోనూ కలిసే వెళ్లడం చూసి గ్రామస్తులు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ హృదయ విదారక ఘటనతో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా సంతాపం వ్యక్తమవుతోంది.

ANN TOP 10