సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి గ్రామంలో మానవ సంబంధాలను మంటగలిపే దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. కేవలం రెండున్నర ఎకరాల భూమి కోసం జీవన్ రెడ్డి అనే వ్యక్తి తన అత్త రాములమ్మ (55)ను అత్యంత కిరాతకంగా హతమార్చాడు. రాములమ్మకు ఇద్దరు కుమార్తెలు కాగా, తనకు ఉన్న భూమిని ఇద్దరికీ సమానంగా పంచుతానని ఆమె చెప్పింది. అయితే, ఆ భూమి మొత్తం తానే దక్కించుకోవాలనే దురాశతో చిన్నల్లుడు జీవన్ రెడ్డి తన అత్తను అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకున్నాడు.
పథకం ప్రకారం, మంగళవారం మధ్యాహ్నం రాములమ్మ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో జీవన్ రెడ్డి తన స్నేహితులతో కలిసి అక్కడికి వెళ్ళాడు. ఆమె కేకలు వేయకుండా నోట్లో గుడ్డలు కుక్కి, టవల్‌తో గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. అనంతరం ఈ దారుణాన్ని దొంగతనంగా చిత్రీకరించేందుకు ఆమె చెవి కమ్మలను తీసుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. హత్య జరిగిన కాసేపటికే ఏమీ తెలియనట్లుగా అక్కడికి చేరుకుని, శవంపై పడి భోరున ఏడుస్తూ దొంగ నాటకాలు ఆడి అందరినీ నమ్మించే ప్రయత్నం చేశాడు.
అయితే, ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు చుట్టుపక్కల ఉన్న సీసీటీవీ ఫుటేజీని పరిశీలించడంతో అసలు నిజం బయటపడింది. జీవన్ రెడ్డి తన స్నేహితులతో కలిసి ఇంట్లోకి వెళ్లడం, ఆ తర్వాత బయటకు రావడం కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అయింది. ఆ ఆధారాలతో పోలీసులు జీవన్ రెడ్డిని అదుపులోకి తీసుకుని విచారించగా, ఆస్తి కోసమే ఈ హత్య చేసినట్లు నిందితుడు అంగీకరించాడు. ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి, ఈ దారుణంలో పాలుపంచుకున్న అతని స్నేహితుల కోసం గాలిస్తున్నారు.









