AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

“ప్లీజ్ డొనాల్డ్..!” ఫ్రాన్స్ అధ్యక్షుడిని హేళన చేసిన ట్రంప్

ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మేక్రాన్ ఒకానొక సందర్భంలో తనను బతిమాలాడంటూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రిపబ్లికన్ చట్టసభ సభ్యుల సమావేశంలో ప్రసంగిస్తూ.. ఔషధ ధరల పెంపు విషయంలో మేక్రాన్ తన ముందు ప్రాధేయపడ్డారని ట్రంప్ హేళన చేశారు. “ప్లీజ్, డొనాల్డ్ ట్రంప్” అంటూ మేక్రాన్ తనను బతిమాలినట్లు చెబుతూ గతంలో ఇరువురి మధ్య జరిగిన దౌత్యపరమైన సంభాషణను ఆయన బహిర్గతం చేశారు.

టారిఫ్‌ల హెచ్చరికతో దారికి..

ఫ్రాన్స్‌లో ఔషధ ధరలను మూడింతలు పెంచాలని తాను కోరగా, మేక్రాన్ తొలుత అందుకు నిరాకరించారని ట్రంప్ వెల్లడించారు. దీంతో ఫ్రాన్స్ నుండి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపై 25 శాతం టారిఫ్ (సుంకం) విధిస్తానని తాను గట్టిగా హెచ్చరించినట్లు తెలిపారు. ఆ దెబ్బకు మేక్రాన్ వెనక్కి తగ్గారని, తాము కోరిన విధంగా ఔషధాల ధరలు పెంచేందుకు అంగీకరించారని ట్రంప్ పేర్కొన్నారు. అయితే ఈ ధరల పెంపు విషయం తమ దేశ ప్రజలకు తెలియకుండా జాగ్రత్త పడాలని మేక్రాన్ తనను కోరినట్లు ట్రంప్ వివరించారు.

అమెరికా కంపెనీల ప్రయోజనం కోసమే

ఫ్రాన్స్ ఔషధాల ధరలు తక్కువగా ఉండటం వల్ల అమెరికా మార్కెట్‌లో వాటి విక్రయాలు ఎక్కువగా జరిగాయని, దీనివల్ల అమెరికా ఫార్మా కంపెనీలు నష్టపోయాయని ట్రంప్ వాదించారు. ఫలితంగా 10 డాలర్లు ఉండాల్సిన మందు బిళ్లను 30 డాలర్లకు పెంచేలా తాను ఒత్తిడి తెచ్చానని, దీనివల్ల అమెరికాలోని స్థానిక కంపెనీలకు మేలు జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. కాగా, తనను హేళన చేస్తూ ట్రంప్ చేసిన ఈ వ్యాఖ్యలపై ఫ్రాన్స్ ప్రభుత్వం లేదా ఇమాన్యుయేల్ మేక్రాన్ ఇంకా అధికారికంగా స్పందించలేదు.

ANN TOP 10