తెలంగాణ రాజకీయాల్లో ఎమ్మెల్సీ కవిత రాజీనామా ఉదంతం పెద్ద కుదుపుకు కారణమైంది. “ఒక వ్యక్తిగా సభ నుంచి వెళ్తున్నాను.. రాజకీయ శక్తిగా తిరిగి వస్తాను” అని ఆమె ప్రకటించిన నేపథ్యంలో, ఆమె ఏ పార్టీలో చేరబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ఈ తరుణంలో కవిత కాంగ్రెస్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారనే ప్రచారం రాజకీయ వర్గాల్లో ఊపందుకుంది. ఇదే అంశంపై కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి స్పందిస్తూ.. కవిత కాంగ్రెస్‌లో చేరితే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
గతంలో దానం నాగేందర్, కడియం శ్రీహరి వంటి సీనియర్ నేతలు కాంగ్రెస్‌లో చేరతారని ఎవరూ ఊహించలేదని, కానీ రాజకీయ పరిస్థితుల దృష్ట్యా వారు పార్టీ మారారని రంగారెడ్డి గుర్తు చేశారు. అదే రీతిలో ఇప్పుడు కవిత కూడా కాంగ్రెస్‌లోకి రావచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. ఇప్పటికే కవితకు పలు ప్రజా సంఘాలు, ఉద్యమకారులు మద్దతు ప్రకటిస్తున్న తరుణంలో, అధికార పార్టీ నేతల నుంచి ఇలాంటి ఆహ్వానాలు రావడం తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు దారితీస్తోంది.
అయితే, కవిత తన భవిష్యత్ కార్యాచరణపై ఇప్పటివరకు స్పష్టమైన ప్రకటన చేయలేదు. సామాజిక తెలంగాణ లక్ష్యంగా తన పోరాటం కొనసాగుతుందని, త్వరలోనే ప్రజల ముందుకు వస్తానని ఆమె చెబుతున్నారు. మరోవైపు ఆమె సొంతంగా కొత్త రాజకీయ పార్టీని ఏర్పాటు చేస్తారనే ప్రచారం కూడా బలంగా వినిపిస్తోంది. కవిత అడుగులు కాంగ్రెస్ వైపు పడతాయా లేదా తనదైన ముద్ర వేయడానికి కొత్త పార్టీతో వస్తారా అనేది మరికొద్ది రోజుల్లో తేలనుంది.









