AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

కరూర్ తొక్కిసలాట కేసు: నటుడు విజయ్‌కు సీబీఐ సమన్లు.. జనవరి 12న ఢిల్లీలో విచారణ!

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న తరుణంలో, టీవీకే చీఫ్ విజయ్‌కు సీబీఐ నోటీసులు ఇవ్వడం ఆ రాష్ట్ర రాజకీయాల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీసింది. గతేడాది సెప్టెంబర్ 27న కరూర్ జిల్లా వేలుసామిపురంలో విజయ్ నిర్వహించిన ర్యాలీలో భారీ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో 41 మంది ప్రాణాలు కోల్పోగా, 60 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటనపై సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ స్వతంత్ర దర్యాప్తు చేస్తోంది.

ఈ కేసు విచారణలో భాగంగా జనవరి 12వ తేదీన ఢిల్లీలోని సీబీఐ ప్రధాన కార్యాలయంలో హాజరు కావాలని విజయ్‌ని అధికారులు ఆదేశించారు. 10 వేల మంది సామర్థ్యం ఉన్న చోట 30 వేల మందికి పైగా జనం రావడం, విజయ్ రాక ఆలస్యం కావడం వల్లే ఈ తొక్కిసలాట జరిగిందని ప్రాథమిక విచారణలో వెల్లడైంది. ఇప్పటికే ఈ కేసులో టీవీకే పార్టీ కీలక నేతలు బుస్సీ ఆనంద్, మతియళగన్‌లను అధికారులు ప్రశ్నించారు. ఇప్పుడు నేరుగా పార్టీ అధినేతనే విచారణకు పిలవడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది.

గతంలోనే ఈ ఘటనపై విజయ్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రూ. 20 లక్షల చొప్పున ఆర్థిక సాయం ప్రకటించడంతో పాటు, స్వయంగా బాధితులను కలిసి క్షమాపణలు చెప్పారు. అయితే, భద్రతా లోపాలు మరియు నిర్వహణ వైఫల్యాలపై సీబీఐ లోతైన విచారణ జరుపుతోంది. విజయ్ తన సినీ కెరీర్‌కు స్వస్తి చెప్పి, పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టిన తరుణంలో ఈ విచారణ ఆయన రాజకీయ ప్రయాణాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తుందోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

ANN TOP 10