బంగ్లాదేశ్‌లో మైనార్టీలైన హిందువులపై దాడులు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్నాయి. డిసెంబర్ 31న షరియత్ పూర్ జిల్లాలో ఉన్మాద మూక దాడికి గురై, తీవ్ర గాయాలతో ఢాకా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న 50 ఏళ్ల ఖకోన్ దాస్ శనివారం ప్రాణాలు కోల్పోయారు. తన గ్రామంలో మందులు, మొబైల్ బ్యాంకింగ్ వ్యాపారం చేసుకునే దాస్, పని ముగించుకుని ఇంటికి వెళ్తుండగా ఆయుధాలతో వచ్చిన అల్లరి మూక ఆయనపై విచక్షణారహితంగా దాడి చేసింది. అంతేకాకుండా, ఆయనపై పెట్రోల్ పోసి సజీవ దహనానికి ప్రయత్నించడం ఆ దేశంలోని భయానక పరిస్థితులకు అద్దం పడుతోంది.
ఖకోన్ దాస్ భార్య సీమా దాస్ కన్నీరుమున్నీరవుతూ తమకు ఎవరితోనూ వివాదాలు లేవని, తమను ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నిందితుల్లో ఇద్దరిని తాను గుర్తించానని, ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని ఆమె డిమాండ్ చేశారు. గత రెండు వారాల్లోనే బంగ్లాదేశ్‌లో హత్యకు గురైన నాలుగో హిందువు ఖకోన్ దాస్ కావడం గమనార్హం. దీనికి ముందు దీపు చంద్ర దాస్, అమృత్ మండల్, బజేంద్ర బిశ్వాస్ వంటి వారు ఉన్మాదుల చేతిలో అత్యంత కిరాతకంగా ప్రాణాలు కోల్పోయారు.
మహమ్మద్ యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం మైనార్టీలకు రక్షణ కల్పిస్తున్నామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో హింస ఏమాత్రం తగ్గడం లేదు. దైవదూషణ ఆరోపణలతో సామాన్య హిందువులను కొట్టి చంపడం, శవాలను చెట్లకు వేలాడదీసి తగులబెట్టడం వంటి ఘటనలు ప్రపంచవ్యాప్తంగా మానవ హక్కుల సంఘాలను దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. భారత్ సైతం ఈ పరిణామాలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ, మైనార్టీల భద్రతను పర్యవేక్షించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వాన్ని కోరుతోంది.









