ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్రీడారంగానికి ఊతమిచ్చేలా తిరుపతి జిల్లాలో భారీ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. తిరుపతి రూరల్ మండలం దామినేడు ప్రాంతంలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ‘స్పోర్ట్స్ సిటీ’ని నిర్మించేందుకు 28.37 ఎకరాల భూమిని కేటాయించింది. గతంలో ఏపీ టూరిజం అథారిటీకి కేటాయించిన ఈ విలువైన భూమిని, ఇప్పుడు ‘శాప్’ (Sports Authority of Andhra Pradesh) కు ఉచితంగా బదిలీ చేసే ప్రతిపాదనకు సోమవారం జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో ఆమోదం లభించింది.
దామినేడులో ఎకరా భూమి విలువ సుమారు రెండున్నర కోట్ల రూపాయల వరకు ఉంటుందని అంచనా. ఇంతటి భారీ విలువైన భూమిని ప్రభుత్వం ఉచితంగా కేటాయించడంతో, ఈ ప్రాజెక్టు త్వరలోనే పట్టాలెక్కనుంది. అయితే, ఈ భూమిని కేవలం క్రీడా అవసరాల కోసం మాత్రమే వినియోగించాలని, రెవెన్యూ శాఖ అనుమతి లేకుండా ఇతర కేటాయింపులు చేయకూడదని ప్రభుత్వం స్పష్టమైన నిబంధనలు విధించింది. శాప్ చైర్మన్ రవి నాయుడు గతంలో ముఖ్యమంత్రి చంద్రబాబును కలిసి చేసిన విజ్ఞప్తికి సానుకూల ఫలితం లభించింది.
ఈ స్పోర్ట్స్ సిటీతో పాటు తిరుపతి పరిసరాల్లో క్రీడా మౌలిక సదుపాయాలు మరింత మెరుగుపడనున్నాయి. తిరుపతిలోని గొల్లవానిగుంటలో ఇప్పటికే సుమారు మూడు కోట్ల రూపాయలతో నిర్మించిన క్రికెట్ స్టేడియం ప్రారంభానికి సిద్ధమైంది. సంక్రాంతి నాటికి ఈ స్టేడియాన్ని సీఎం చేతుల మీదుగా ప్రారంభించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. రాజధాని అమరావతిలో అంతర్జాతీయ స్పోర్ట్స్ సిటీ నిర్మాణంతో పాటు, ప్రతి నియోజకవర్గంలోనూ క్రీడా మైదానాలు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ లక్ష్యంలో తిరుపతి స్పోర్ట్స్ సిటీ ఒక కీలక అడుగుగా మారనుంది.









