రాష్ట్రంలో ప్రయాణ సమయాన్ని తగ్గించి, జిల్లాల మధ్య అనుసంధానాన్ని పెంచేందుకు ప్రభుత్వం సుమారు 29,057 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ మెగా ప్రాజెక్టును చేపట్టింది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న 46 వేల కిలోమీటర్ల రహదారులను రాబోయే రెండు దశాబ్దాలలో 1,15,000 కిలోమీటర్లకు విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పనుల పర్యవేక్షణ కోసం ప్రభుత్వం ఒక ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేసింది. నిధుల సమీకరణ కోసం ‘హైబ్రిడ్ యాన్యుటీ మోడ్’ విధానాన్ని అవలంబిస్తూ ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో పనులు వేగవంతం చేయనున్నారు.
ముఖ్యంగా హైదరాబాద్‌ను పొరుగు రాష్ట్రాల ప్రధాన నగరాలతో కలిపే రహదారులను ఆరు వరుసల ఎక్స్‌ప్రెస్ వేలుగా అభివృద్ధి చేయనున్నారు. ఇందులో ప్రధానంగా:
-
హైదరాబాద్ – విజయవాడ: ప్రస్తుతం ఉన్న 4 వరుసల రహదారిని 6 వరుసలుగా విస్తరించి, రూ. 9,090 కోట్లతో ఎక్స్‌ప్రెస్ వేగా మారుస్తారు.
-
హైదరాబాద్ – బెంగళూరు: రూ. 5,221 కోట్లతో ఈ మార్గాన్ని ఆధునీకరించేందుకు కేంద్రం ఇప్పటికే అనుమతి ఇచ్చింది.
-
హైదరాబాద్ – నాగ్‌పూర్: 397 కిలోమీటర్ల మేర 6 వరుసల రహదారిగా తీర్చిదిద్దుతారు.
-
ఫ్యూచర్ సిటీ – మచిలీపట్నం: కొత్తగా నిర్మిస్తున్న ఫ్యూచర్ సిటీ నుంచి 234 కిలోమీటర్ల మేర సరికొత్త ‘గ్రీన్ ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే’ రానుంది.
రహదారుల వెంట కేవలం ప్రయాణమే కాకుండా భద్రతకు కూడా ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ‘స్మార్ట్ మొబిలిటీ’లో భాగంగా అత్యాధునిక లైటింగ్, సీసీ కెమెరాలు, అత్యవసర సహాయక కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు. అలాగే పర్యావరణ పరిరక్షణ కోసం ‘గ్రీన్ హైవేస్’ విధానంలో రోడ్లకి ఇరువైపులా మొక్కలు నాటడం, వర్షపు నీటి నిల్వ వ్యవస్థలను నిర్మిస్తున్నారు. ఈ భారీ ప్రాజెక్టులు పూర్తయితే తెలంగాణ రవాణా రంగం దేశంలోనే అగ్రస్థానంలో నిలవడమే కాకుండా, గ్రామీణ ఆర్థిక వ్యవస్థ కూడా గణనీయంగా బలోపేతం అవుతుంది.









