పాకిస్థాన్‌కు భారీ సైనిక సాయం అందించేందుకు అమెరికా ముందుకొచ్చింది. పాక్ వైమానిక దళానికి చెందిన F-16 యుద్ధ విమానాల ఆధునికీకరణ కోసం సుమారు $686 మిలియన్ డాలర్ల (దాదాపు ₹5,700 కోట్లు) విలువైన ఒప్పందానికి అమెరికా ఆమోదం తెలిపింది. ఈ డీల్‌లో భాగంగా అత్యాధునిక టెక్నాలజీ, లింక్-16 వ్యవస్థలు, క్రిప్టోగ్రాఫిక్ పరికరాలు, ఏవియానిక్స్ అప్‌డేట్స్, విడిభాగాలు మరియు సమగ్ర లాజిస్టికల్ సపోర్ట్ వంటివి పాకిస్థాన్‌కు అందించనున్నారు.
అమెరికా రక్షణ భద్రతా సహకార సంస్థ (DSCA) ఈ ప్రతిపాదనను యూఎస్ కాంగ్రెస్‌కు పంపింది. ఈ ప్రతిపాదనపై యూఎస్ కాంగ్రెస్‌లో 30 రోజుల పాటు సమీక్ష జరగనుంది. ఈ కీలక పరిణామాలను భారత్ చాలా నిశితంగా గమనిస్తోంది. అమెరికా ఈ ఒప్పందాన్ని పాకిస్థాన్ F-16 విమానాల నిర్వహణ మరియు కార్యాచరణ భద్రతను మెరుగుపరచడానికే కుదుర్చుకున్నట్లు స్పష్టం చేసింది.
ఈ ఒప్పందం వల్ల ఈ ప్రాంతంలో సైనిక సమతుల్యత దెబ్బతినదని అమెరికా తన లేఖలో పేర్కొంది. అంతేకాక, ఉగ్రవాద వ్యతిరేక పోరాటంలో అమెరికా, మిత్రపక్షాలతో కలిసి పనిచేసేందుకు ఈ టెక్నాలజీ పాకిస్థాన్‌కు ఉపయోగపడుతుందని తెలిపింది. ఈ ఆధునికీకరణతో F-16 విమానాల జీవితకాలం 2040 వరకు పెరుగుతుందని వివరించింది. 2021లోనే పాకిస్థాన్ ఈ అప్‌గ్రేడ్‌ల కోసం అభ్యర్థించినప్పటికీ, ఇప్పుడు ఆమోదం తెలపడం ప్రాధాన్యత సంతరించుకుంది.









