ఏపీలోని కూటమి ప్రభుత్వం రహదారుల నిర్మాణానికి అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ముఖ్యంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. తన పంచాయతీ రాజ్ శాఖ పరిధిలో రోడ్ల నిర్మాణానికి పెద్ద పీట వేస్తున్నారు. గుంతలు లేని బాటలకు కృషి చేస్తున్నారు. ప్రస్తుతం దీనికి అద్దం పడుతూ నెట్టింట ఓ వీడియో విపరీతంగా వైరల్ అవుతోంది. ఒకప్పుడు గుంతల మయంగా మారి.. వాహనదారులను తీవ్ర ఇబ్బందులకు గురిచేసిన కాకినాడ జిల్లాలోని ఏలేశ్వరం – అడ్డతీగల రహదారి పవన్ ఆదేశాలతో కొత్తరూపును సంతరించుకుంది. ప్రస్తుతం ఒక్క గుంత లేకుండా ఇరువైపులా చెట్లతో ఆ మార్గం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది.
కాకినాడ జిల్లా ఏలేశ్వరం నుంచి అడ్డ తీగల వెళ్లే మార్గంలో 10.5 కి.మీ పొడవున ఈ మార్గం ఉంది. 15 ఏళ్లుగా తీవ్ర నిర్లక్ష్యానికి గురికావడంతో.. రోడ్డుపై విపరీతంగా గుంతలు ఏర్పడ్డాయి. మరీ ముఖ్యంగా ఏలేశ్వరం నుంచి జి.అన్నవరం మధ్య రహదారి నరకకూపాన్ని తలపించింది. రోడ్డు విపరీతంగా దెబ్బతినడంతో అటుగా వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటూ వచ్చారు. అయితే ఆ మార్గంలో వెళ్లే వారు పడుతున్న కష్టం.. డిప్యూటీ సీఎం పవన్ దృష్టికి వెళ్లింది. దీంతో ఏలేశ్వరం – అడ్డతీగల రహదారిలో మరమ్మతులు చేపట్టాలని కాకినాడ అధికారులు, ఆర్ అండ్ బీ ఇంజినీర్లను పవన్ ఆదేశించారు.
గతేడాది సెప్టెంబర్ లో పవన్ కళ్యాణ్ ఈ ఆదేశాలు ఇవ్వగా.. సంబంధిత అధికారులు యుద్దప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఆగస్టు నాటికి 10.5 కి.మీ పొడవైన ఈ రహదారి నిర్మాణం దాదాపుగా పూర్తయింది. దీంతో అప్పటి అధ్వాన్న రోడ్డును.. ఇప్పటి అద్భుతమైన మార్గాన్ని కంపేర్ చేస్తూ నెట్టింట వీడియోలు వైరల్ అవుతున్నాయి. రోడ్డుకు ఇరువైపులా చెట్లతో ఆ మార్గం ఎంతగానో అభివృద్ధి చెందిందని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. అటుగా వెళ్లే వాహనదారులు సైతం రహదారి అభివృద్ధి చూసి సంతోషిస్తున్నారు. 2009 నుంచి ఈ మార్గాన్ని పట్టించుకునే నాథుడే లేకపోయాడని.. డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలతో ఈ మార్గానికి మోక్షం లభించిందని ప్రశంసిస్తున్నారు.








