చిరు ఏ ఈవెంట్ కి వెళ్ళినా ఆ సమయంలో చిరుతో సినిమా చేసే దర్శకులు గుండెని అరచేతిలో పట్టుకొని కళ్ళార్పకుండా ఆ ఈవెంట్ ని చూడాల్సిన పరిస్థితి.కారణం ఎప్పుడు ఆ సినిమాకి సంబందించిన టైటిల్ నో లేక , సినిమాకి చెందిన కాన్ఫిడెన్షియల్ విషయాలనో లీక్ చేస్తాడన్న భయం.
అందుకే ఇప్పుడు ఇండస్ట్రీలో సరదాగా ‘చిరు లీక్స్’ అంటూ ఓ ట్రెండ్ కూడా నడుస్తోంది.
ఇప్పటికే చాలాసార్లు తన సినిమాలకు సంబంధించిన టైటిల్స్, అప్‌డేట్స్, ఆసక్తికరమైన విషయాలను చిరంజీవి స్వయంగా లీక్ చేసిన సందర్భాలు ఉన్నాయి.యూనిట్ వాళ్లు చెప్పొద్దని ఎంత చెప్పినా.. ‘అది నా వల్ల కాదు’ అన్నట్టుగా ఆయన స్టైల్ ఉంటుంది. ఇప్పుడు మరోసారి అదే జరిగింది. ఈసారి చిరు లీక్ చేసిన విషయం ఏంటో తెలుసా మెగా 158 సినిమా టైటిల్ .
మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై మొదటి నుంచే మంచి బజ్ ఉంది. వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘వాల్తేరు వీరయ్య’ మంచి సక్సెస్ అందుకోవడంతో.. ఇప్పుడు ఈ సినిమా ఎలా ఉండబోతుందా అని మెగా ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
సినిమాకు సంబంధించి హీరోయిన్‌గా అనస్వర రాజన్ నటిస్తున్న విషయం ఇప్పటికే బయటకు వచ్చింది. ఇక మిగతా విషయాలను మేకర్స్ ఒక్కొక్కటిగా రివీల్ చేయాలని చూస్తున్నారు.కానీ ఇక్కడ నేనుండగా మీకెందుకు చింత దండగ అన్నట్టుగా వాళ్ళు రివీల్ చేసేకంటే ముందే లీకులు చేసేస్తున్నాడు.
మెగా 158 షూటింగ్ మొదలైనప్పటి నుంచే చిరంజీవి ఈ సినిమా విషయంలో సరదాగా లీకులు ఇస్తూ వస్తున్నారు.దర్శకుడు బాబీ, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ ఇద్దరూ సినిమా టైటిల్ చెప్పొద్దని చిరంజీవిని ముందే వారించినా.. మెగాస్టార్ మాత్రం వినలేదట.‘వాళ్లు చెప్పొద్దంటే నేను ఆగిపోతానా? సరైన టైమ్ చూసి నేనే లీక్ చేస్తా’ అన్నట్టుగా అప్పట్లోనే ఒక వీడియోతో ఫన్ చేశారు.
ఇక అసలు విషయంలోకి వెళ్తే తాజాగా ‘కొరియన్ కనకరాజు’ సక్సెస్ మీట్‌లో చిరంజీవి పాల్గొన్నారు. వరుణ్ తేజ్ హీరోగా మేర్లపాక గాంధీ తెరకెక్కించిన ఈ సినిమా విజయాన్ని సెలబ్రేట్ చేసుకునేందుకు ఈ ఈవెంట్ ఏర్పాటు చేశారు. చిరంజీవి ముఖ్య అతిథిగా రావడంతో కార్యక్రమం మరింత గ్రాండ్‌గా మారింది.
ఇక స్టేజీ ముందు కూర్చున్న చిరు తమన్ తో మాట్లాడుతూ నువ్ RR చేశావు కదా ఎలా వచ్చింది ?అంటే తమన్ బాగొచ్చింది ,అదిరిపోయింది అంటూ చెప్పుకొచ్చాడు.ఆగస్ట్ 22న నా బర్త్ డే సందర్భంగా అంటూ మాట్లాడిన చిరు ఒక్కసారిగా ‘కదిరి’ అంటూ ఓ హింట్ ఇచ్చారు. అంతే అక్కడున్న వాళ్లంతా ఒక్కసారిగా నవ్వుల్లో మునిగిపోయారు.సినిమా టీమ్ ఇంతకాలం దాచిన విషయాన్ని మెగాస్టార్ ఇలా చెప్పెశాడుగా అంటూ ఎవరికి వారు గుసగుసలు పెట్టేశారు.
ఇక చిరు చెప్పిన ‘కదిరి’తో మెగా 158 టైటిల్ ‘కదిరి నరసింహుడు’ అని లేదు ‘కదిరి కాకాజీ ‘అని అంటూ సోషల్ మీడియాలో తెగ డిబేట్లు పెట్టేశారు నెటిజన్లు.అభిమానులు కూడా ఇదే టైటిల్ అయి ఉంటుందని ఫిక్స్ అయిపోతున్నారు. అయితే మేకర్స్ అధికారికంగా ప్రకటించే వరకు మాత్రం ఇది కన్ఫర్మ్ అని చెప్పలేం.ఇంతకీ చిరంజీవి ఊరికే ‘కదిరి’ అన్నారా? లేక నిజంగానే టైటిల్ అదేనా? అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.
ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే.. చిరంజీవి పుట్టినరోజు ఆగస్టు 22. అదే రోజు మెగా 158 నుంచి టైటిల్‌కు సంబంధించిన అప్‌డేట్ వచ్చే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది.దీంతో మెగా ఫ్యాన్స్‌లో ఇప్పుడు ఆసక్తి మరింత పెరిగింది. చిరు ముందే చెప్పినట్టుగా ‘కదిరి నరసింహుడు’ టైటిల్‌తో టీజర్ వస్తుందా? లేకపోతే మెగాస్టార్ ఇచ్చిన ఈ హింట్ వెనుక ఇంకేదైనా ట్విస్ట్ ఉందా? అని ఎదురుచూస్తున్నారు.
గతంలో కూడా ఇలాంటి సరదా లీకులతో చిరంజీవి అభిమానులను సర్‌ప్రైజ్ చేశారు. ఇప్పుడు మళ్లీ అదే జరిగింది. అందుకే సోషల్ మీడియాలో ‘చిరు లీక్స్’ అనే మాట మరోసారి వైరల్ అవుతోంది.
ఇక ‘వాల్తేరు వీరయ్య’ తర్వాత బాబీతో చిరంజీవి చేస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలు కూడా భారీగానే ఉన్నాయి.ఆ సినిమాలో చిరంజీవి మాస్ లుక్, కామెడీ, యాక్షన్‌తో ఫ్యాన్స్‌ను ఫుల్‌గా ఎంటర్‌టైన్ చేశారు. ఇప్పుడు మెగా 158లో బాబీ ఇంకెంత కొత్తగా చూపిస్తాడో చూడాలి.








