సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సత్వార్ గ్రామం సమీపంలో జాతీయ రహదారిపై ఉన్న యూ-టర్న్ వద్ద ఒక ట్యాంకర్.. కూలీలతో ప్రయాణిస్తున్న ఆటోను ఢీకొట్టింది. ఈ ఘోర రోడ్డు ప్రమాదంలో ఐదుగురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు.
కర్ణాటక రాష్ట్రంలోని హుమ్నాబాద్ వైపు నుంచి జహీరాబాద్‌కు వేగంగా వస్తున్న ఒక ట్యాంకర్, కూలీలతో ప్రయాణిస్తున్న ఆటోను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద ధాటికి ఆటో పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. ఆటోలో ప్రయాణిస్తున్న ఐదుగురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదంలో మరణించిన వారంతా కర్ణాటక రాష్ట్రం రాజగిరి గ్రామానికి చెందిన కూలీలుగా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను వెంటనే చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉండటంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముందని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదానికి గల పూర్తి వివరాలపై దర్యాప్తు వేగవంతం చేశారు.








