స్విట్జర్లాండ్‌లో మాజీ మిస్ స్విట్జర్లాండ్ ఫైనలిస్ట్ క్రిస్టినా జోక్సిమోవిక్ (38) దారుణ హత్యకు గురైంది. ఈ కేసులో ఆమె భర్తే, థామస్ (43), నిందితుడని అధికారులు నిర్ధారించారు. గోప్యతా నిబంధనల ప్రకారం థామస్‌పై హత్య అభియోగాలు నమోదు చేసినట్లు స్విస్ ప్రాసిక్యూటర్లు ప్రకటించారు. ఫిబ్రవరిలో బిన్నింగెన్‌లోని వారి నివాసంలో థామస్ తన భార్య క్రిస్టినాను మొదట గొంతు నులిమి హత్య చేశాడు.
హత్య చేసిన అనంతరం, నిందితుడు ఆమె శరీరాన్ని ముక్కలుగా నరికి, ఆనవాళ్లు లేకుండా చేసేందుకు అత్యంత క్రూరంగా ప్రయత్నించాడు. పోస్టుమార్టం నివేదిక ప్రకారం, మృతదేహాన్ని ముక్కలు చేయడానికి అతను రంపపు కత్తి మరియు గార్డెన్ కత్తెరను ఉపయోగించాడు. అంతటితో ఆగకుండా, శరీర భాగాలను ఒక పారిశ్రామిక బ్లెండర్‌లో వేసి గుజ్జుగా మార్చి, రసాయన ద్రావణంలో కరిగించే ప్రయత్నం చేశాడు. దర్యాప్తులో పోలీసులు బ్లెండర్‌తో పాటు శరీర చర్మం, ఎముకల ముక్కలను స్వాధీనం చేసుకున్నారు. ఈ దారుణం జరుగుతున్న సమయంలో నిందితుడు తన ఫోన్‌లో యూట్యూబ్ వీడియోలు చూస్తున్నట్లు కోర్టు పత్రాల్లో పేర్కొన్నారు.
మొదట తన భార్య విగతజీవిగా కనిపించిందని చెప్పిన థామస్, మార్చిలో నేరాన్ని అంగీకరించినప్పటికీ, ఆత్మరక్షణ కోసమే చంపినట్లు వాదించాడు. అయితే, ఫోరెన్సిక్ నిపుణులు ఈ వాదనను తోసిపుచ్చారు, ఊపిరాడకపోవడం వల్లే ఆమె మరణించిందని స్పష్టం చేశారు. మృతురాలి తండ్రి వారి ఇంటి లాండ్రీ గదిలో ఒక బ్యాగు నుంచి జుట్టు బయటకు కనిపించడంతో ఈ దారుణం వెలుగులోకి వచ్చింది. నిందితుడు అత్యంత క్రూరంగా ప్రవర్తించాడని పోలీసులు కోర్టుకు తెలిపారు. ఈ దంపతులకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.









