తెలంగాణ ప్రభుత్వం ఆతిథ్యం ఇవ్వనున్న ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2026 పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఎంసీఆర్ హెఆర్డీలోని బోధి పెవిలియన్ లో ఖేలో ఇండియా యూత గేమ్స్ ఏర్పాట్లు, నిర్వహణపై మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.
జాతీయ స్థాయిలో వివిధ రాష్ట్రాల నుంచి పాల్గొనే ఈ పోటీలకు సంబంధించి మౌలిక వసతులను అభివృద్ధి చేయాలని సీఎం సూచించారు. డిసెంబరులో పోటీలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. హైదరాబాద్ లోని స్టేడియం లలో ప్రస్తుత పరిస్థితిని పరిశీలించి, క్రీడా పోటీలకు అనుగుణంగా శాశ్వత ప్రాతిపదికన అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు అవసరమైన నిధులను అందించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.
ప్రారంభోత్సవ, ముగింపు వేడుకలకు సంబంధించిన ముఖ్య అతిథులు, ప్రముఖ క్రీడాకారులు, సినీ ప్రముఖులను కార్యక్రమాల్లో భాగస్వాములను చేసేందుకు ఇప్పటి నుంచే కసరత్తు ప్రారంభించాలన్నారు. మౌలిక వసతులు, క్రీడల నిర్వహణ, అతిథులకు కావాల్సిన సౌకర్యాల ఏర్పాట్లకు సంబంధించి పని విభజన చేసుకుని బాధ్యత తీసుకోవాలని తెలిపారు. తెలంగాణకు చెందిన అర్జున అవార్డు గ్రహీతలు, తెలంగాణ స్పోర్ట్స్ హబ్ బోర్డు సభ్యులు, ఒలింపిక్స్ అసోసియేషన్ తో పాటు జాతీయ స్థాయి క్రీడా ప్రతినిధులను కార్యక్రమంలో భాగస్వాములను చేయాలని అధికారులకు సూచించారు.
ఇందుకు సంబంధించి ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేయాలని తెలిపారు. ఖేలో ఇండియా యూత్ గేమ్స్ లో భాగంగా 20 రకాల స్పోర్ట్స్ కు సంబంధించిన పోటీలు నిర్వహించనున్న నేపథ్యంలో.. క్రీడా విభాగాల వారీగా పోటీ ప్రదేశాలను గుర్తించి ఏర్పాట్లు చేయాలన్నారు. క్రీడా స్ఫూర్తిని చాటేలా నిర్వహణ ఉండాలని తెలిపారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రి వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారావు, SATG చైర్మన్ శివసేనా రెడ్డి, క్రీడా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, SATG ఎండీ సోనీబాల దేవి పాల్గొన్నారు.








