నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో వస్తున్న ‘అఖండ-2: తాండవం’ సినిమా విడుదలకు సంబంధించిన అనిశ్చితిపై నటుడు, దర్శకుడు బండి సరోజ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని ఆర్థిక లావాదేవీల కారణంగా సినిమాను వాయిదా వేస్తున్నట్లు నిర్మాతలు (14 రీల్స్ ప్లస్) ప్రకటించిన నేపథ్యంలో, బండి సరోజ్ తన సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు.
14 రీల్స్ ప్లస్ సంస్థ వ్యవహారం బాధ్యతారాహిత్యంగా ఉందంటూ ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. “ఏదైనా ఒకటి స్పష్టంగా చెబితే, 12న విడుదల కావాల్సిన సినిమాల పబ్లిసిటీ ఖర్చులైనా మిగులుతాయి. అటు అభిమానులను, ఇటు సినిమా ఇండస్ట్రీని, మరోవైపు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లను అందరినీ నిద్రలేకుండా చేసి ఏం సాధిస్తున్నారు? చెడ్డ పేరు తప్ప మరొకటి కాదు. బాధ్యత ఉండాలి” అంటూ ఆయన డిమాండ్ చేశారు.
ఈ భారీ మల్టీస్టారర్ చిత్రం రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించగా, బాలయ్య చిన్న కుమార్తె తేజస్విని సహ నిర్మాతగా వ్యవహరించారు. ‘అఖండ’ సినిమాకు సీక్వెల్‌గా వస్తున్న ఈ చిత్రం టీజర్లు, ట్రైలర్‌లకు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ పరిస్థితుల్లో సినిమా విడుదల తేదీపై స్పష్టత ఇవ్వాలని బండి సరోజ్ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.









