మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యాలు మరియు దార్శనికతను విన్న తర్వాత, స్కిల్ యూనివర్సిటీకి ఛైర్మన్‌గా ఉండాలనే ఆయన విజ్ఞప్తిని తిరస్కరించలేకపోయానని తెలిపారు. ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’ సందర్భంగా ‘తెలంగాణ రైజింగ్ విజన్-2047’ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించే కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. మొదట టెక్ మహీంద్రా యూనివర్సిటీకి ఛైర్మన్‌గా ఉన్నందున రేవంత్ రెడ్డి విజ్ఞప్తిని తిరస్కరించానని, అయితే ఆయన విజన్ విన్నాక అంగీకరించినట్లు ఆనంద్ మహీంద్రా వెల్లడించారు.
తెలంగాణ రైజింగ్ విజన్ బ్లూప్రింట్‌ను తాను చూశానని, ఈ డాక్యుమెంట్‌ను ప్రజలనే కేంద్రంగా చేసుకుని రూపొందించారని ఆయన ప్రశంసించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దార్శనికతకు ఆయన అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆనంద్ మహీంద్రాతో పాటు సినీ నటుడు చిరంజీవి, ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడిన ఆర్బీఐ మాజీ గవర్నర్ దువ్వూరి సుబ్బారావు, తెలంగాణ రాష్ట్రం గొప్ప అభివృద్ధి సాధిస్తోందని, దేశంలోనే అత్యధిక వృద్ధి రేటు ఉన్న రాష్ట్రంగా నిలిచిందని అన్నారు. హైదరాబాద్ ఇప్పుడు ప్రపంచస్థాయి కంపెనీలకు గమ్యస్థానంగా ఉందని పేర్కొన్నారు. తెలంగాణ విజన్ డాక్యుమెంట్ నీతి ఆయోగ్ లక్ష్యాలకు అనుగుణంగా ఉందని, ప్రతి సంవత్సరం 8-9 శాతం వృద్ధి సాధిస్తే తెలంగాణ తన లక్ష్యాలను అందుకోగలదని సుబ్బారావు ధీమా వ్యక్తం చేశారు.









