ఇండోనేసియా రాజధాని జకార్తాలో మంగళవారం ఒక ఏడు అంతస్తుల భవనంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘోర ఘటనలో ఇప్పటివరకు ఇరవై మంది మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. మృతుల్లో పదిహేను మంది పురుషులు మరియు ఐదుగురు మహిళలు ఉన్నారు. ఈరోజు మధ్యాహ్నం సమయంలో మొదటి అంతస్తు నుంచి మంటలు సోకాయని, భవనం మొత్తం మీదకి మంటలు వ్యాపించడంతో ప్రాణనష్టం సంభవించిందని సెంట్రల్ జకార్తా పోలీసులు తెలిపారు.
ప్రమాదం జరిగిన వెంటనే సహాయక బృందాలు అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తెచ్చాయి. అయినప్పటికీ, ఈ ప్రమాదంలో పదుల సంఖ్యలో గాయపడ్డారు. గాయపడిన వారందరినీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు; వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని, దాంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. కొందరి నుంచి ఫోన్లకు, మెయిల్స్ కు స్పందన రాకపోవడంతో వారి బంధువులు ఆందోళన చెందుతున్నారు.
ఈ భవనం టెరా డ్రోన్ ఇండోనేషియా కార్యాలయం అని, ఇది మైనింగ్ నుంచి వ్యవసాయ రంగాల వరకు ఏరియల్ సర్వేలకు డ్రోన్లు అందించే జపాన్‌కు చెందిన టెరా డ్రోన్ కార్పొరేషన్ ఇండోనేషియా విభాగమని పోలీసులు తెలిపారు. మంటలను పూర్తిగా ఆర్పేసిన తర్వాత కూడా భవనం లోపల మరింతమంది ఉన్నారేమోనన్న అనుమానంతో సిబ్బంది గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. అయితే, ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.









