ఇండిగో ఎయిర్‌లైన్స్ విమానాల రద్దుతో ఏర్పడిన గందరగోళాన్ని ఆసరాగా తీసుకుని, మిగిలిన విమానయాన సంస్థలు ఛార్జీలను భారీగా పెంచడంపై కేంద్ర ప్రభుత్వం మరియు పౌర విమానయాన శాఖ సీరియస్ అయ్యాయి. అన్ని మార్గాల్లో టికెట్ ధరలు అమాంతం పెరిగాయి. ఉదాహరణకు, సాధారణంగా రూ. 6 వేల నుంచి 7 వేల వరకు ఉండే హైదరాబాద్ నుంచి ఢిల్లీకి విమాన ఛార్జీలు ఏకంగా రూ. 50 వేల వరకు పెంచినట్లు సమాచారం.
విమానాల రద్దుతో ఏర్పడిన ఈ అత్యవసర పరిస్థితిని ‘క్యాష్ చేసుకోవాలని’ చూస్తున్న విమానయాన సంస్థల తీరుపై కేంద్రం ఆగ్రహం వ్యక్తం చేసింది. టికెట్ ధరలను పెంచవద్దని కేంద్ర ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. ప్రయాణికుల నుంచి కేవలం సాధారణ రోజుల్లో తీసుకునే ఛార్జీలను మాత్రమే వసూలు చేయాలని ఆదేశించింది.
ప్రయాణికుల నుంచి భారీ మొత్తంలో వసూలు చేస్తే సంబంధిత విమానయాన సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని కేంద్ర ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసింది. ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రయాణీకులను దోచుకోవాలని చూసే ప్రయత్నాలను కేంద్రం అడ్డుకోవాలని నిర్ణయించింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం ప్రయాణికులకు కొంతవరకు ఊరట కలిగించే అవకాశం ఉంది.









