హైదరాబాద్ నగరంలో శాంతిభద్రతల పర్యవేక్షణ, పటిష్ఠం చేసే దిశగా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ ఒక చారిత్రక నిర్ణయం తీసుకున్నారు. ‘ఆపరేషన్ కవచ్’ పేరుతో రాత్రి 10 గంటల నుంచి నగరవ్యాప్తంగా విస్తృతమైన నాకాబందీని నిర్వహిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. కమిషనరేట్ చరిత్రలో ఇదివరకు ఎన్నడూ లేని విధంగా, దాదాపు 5,000 మంది పోలీసు సిబ్బంది ఈ ప్రత్యేక డ్రైవ్‌లో పాల్గొంటున్నట్లు ఆయన తెలిపారు.
ఈ ‘ఆపరేషన్ కవచ్’ కార్యక్రమంలో భాగంగా ఏకకాలంలో 150 కీలక ప్రాంతాల్లో ముమ్మర తనిఖీలు చేపడుతున్నారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో శాంతిభద్రతలు, ట్రాఫిక్, టాస్క్‌ఫోర్స్ విభాగాలతో పాటు ఆర్మ్‌డ్ రిజర్వ్, బ్లూ కోల్ట్స్, పెట్రోలింగ్ బృందాలు సంయుక్తంగా పాల్గొంటున్నాయి. ఈ భారీ నాకాబందీని ఏర్పాటు చేయడం ద్వారా నేరాలను అరికట్టడం, అనుమానితులను అదుపులోకి తీసుకోవడం వంటివి లక్ష్యంగా పెట్టుకున్నారు.
ప్రజా భద్రత కోసం చేపట్టిన ఈ అతిపెద్ద కార్యక్రమంలో నగర పౌరులందరూ పోలీసులకు పూర్తిగా సహకరించాలని కమిషనర్ వీసీ సజ్జనార్ కోరారు. ఎక్కడైనా అనుమానాస్పద కదలికలు గమనిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. ఈ విస్తృతమైన తనిఖీలు నగరంలో నేర కార్యకలాపాలను నియంత్రించడానికి, ప్రజల్లో భద్రతా భావాన్ని పెంచడానికి ఉద్దేశించినవి.









