AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇమ్రాన్ ఖాన్ బతికే ఉన్నారు….

పాకిస్థాన్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఆరోగ్యం మరియు ఉనికిపై గత నెల రోజులుగా నెలకొన్న తీవ్ర ఉత్కంఠకు ఎట్టకేలకు తెరపడింది. రావల్పిండిలోని అదియాలా జైల్లోనే ఇమ్రాన్ ఉన్నట్లు ధృవీకరణ లభించింది. ఆయన సోదరి డాక్టర్ ఉజ్మా ఖాన్‌కు ఇమ్రాన్‌తో భేటీ అయ్యేందుకు ప్రభుత్వం అనుమ‌తి ఇవ్వడంతో, ఆయన జైల్లోనే మరణించారంటూ గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో సాగుతున్న వదంతులకు ఫుల్‌స్టాప్ పడింది.

గత 25 రోజులుగా ఇమ్రాన్ ఖాన్ బయటి ప్రపంచానికి కనిపించకపోవడంతో ఆయన ఆరోగ్యంపై తీవ్ర ఆందోళనలు, మరణ వార్తల వదంతులు మొదలయ్యాయి. ఆయన జైల్లోనే మరణించి ఉండొచ్చని, ఈ వార్త బయటకు వస్తే తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతాయనే భయంతో ప్రభుత్వం ఈ విషయాన్ని దాచిపెడుతోందని సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం జరిగింది. ఆయన జనాదరణకు ప్రభుత్వం భయపడుతోందని, అందుకే ఆయనను ఏకాకిని చేసి, దేశం విడిచి వెళ్లేలా ఒత్తిడి తెస్తున్నారని ఆయన పార్టీ పాకిస్థాన్ తెహ్రీక్-ఏ-ఇన్సాఫ్ (పీటీఐ) ఆరోపించింది.

ఈ నేపథ్యంలో, ఇమ్రాన్ ఖాన్‌కు న్యాయం చేయాలని కోరుతూ ఆయన పార్టీ కార్యకర్తలు ఇస్లామాబాద్ హైకోర్టు వద్ద నిరసనలు చేపట్టారు. ఈ పెరిగిన ఒత్తిడితో ప్రభుత్వం దిగివచ్చి, ఆయన సోదరిని కలిసేందుకు అనుమతి ఇచ్చింది. 72 ఏళ్ల ఇమ్రాన్ ఖాన్.. 2022లో అవిశ్వాస తీర్మానంలో అధికారం కోల్పోయిన తర్వాత నమోదైన అవినీతి కేసుల కింద 2023 ఆగస్టు నుంచి జైల్లో ఉన్నారు. ఈ కేసులన్నీ రాజకీయ ప్రేరేపితమైనవని ఆయన కొట్టిపారేస్తున్నారు.

ANN TOP 10