దేశ రాజధాని ఢిల్లీలో వాయు నాణ్యత ప్రమాదకర స్థాయికి పడిపోవడంపై ప్రధానమంత్రి కార్యాలయం (పీఎంవో) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రధానమంత్రి ముఖ్య కార్యదర్శి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమీక్ష సమావేశంలో ఢిల్లీ కాలుష్యంపై చర్చించారు. ఈ సందర్భంగా, కాలుష్యానికి కారకమవుతున్న వాహనాలపై తక్షణమే చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను పీఎంవో ఆదేశించింది.
సమావేశంలో ఢిల్లీలో వాహనాల కాలుష్యం ప్రధానాంశంగా చర్చకు వచ్చింది. దేశ రాజధానిలో ఇంకా 37 శాతం మేర పాత వాహనాలు వినియోగంలో ఉన్నట్లు గుర్తించారు. వీటి స్థానంలో ఎలక్ట్రిక్ వాహనాలను (ఈవీలు) అందుబాటులోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని అధికారులు అభిప్రాయపడ్డారు. దీని నివారణలో భాగంగా విద్యుత్ వాహనాల వినియోగాన్ని విస్తృతం చేసేందుకు చర్యలు ముమ్మరం చేయాలని పీఎంవో సూచించింది.
ఈవీ వాహనాలకు రాయితీలు ఇవ్వడంతో పాటు, ఛార్జింగ్ స్టేషన్లు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులకు సూచించినట్లు తెలుస్తోంది. కాలుష్య కారక పెట్రోల్, డీజిల్ వాహనాల వినియోగాన్ని తగ్గించడం ద్వారా వాయు కాలుష్యాన్ని నియంత్రించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ఉన్నతస్థాయి సమావేశం కాలుష్య నివారణ దిశగా ప్రభుత్వం తీసుకుంటున్న సీరియస్ చర్యల్లో భాగం.









