ఎమ్మెల్సీ కవిత డోస్ పెంచి, బీఆర్‌ఎస్ పార్టీలోని ఒక్కో సీనియర్ నేతను లక్ష్యంగా చేసుకుని బ్లాస్టింగ్ కామెంట్స్ చేస్తుండటంతో, ఇప్పటిదాకా సంయమనం పాటించిన గులాబీ పార్టీ నాయకులు ఇకపై స్ట్రాంగ్ కౌంటర్ ఇవ్వాలని నిర్ణయించుకున్నారు. గతంలో ‘అధినేత కూతురు, ఇంటి ఆడబిడ్డ’గా భావించి కవిత వ్యాఖ్యలను లైట్ తీసుకున్న బీఆర్‌ఎస్, ఇప్పుడు తగ్గేదేలే అంటూ వాయిస్ రైజ్ చేస్తోంది. నిరంజన్ రెడ్డి వంటి సీనియర్ నేతలు కూడా కవితపై ‘లిక్కర్ రాణి’ అంటూ రివర్స్ అటాక్ చేయడం, బీఆర్‌ఎస్ వైఖరిలో వచ్చిన ముఖ్యమైన మార్పును సూచిస్తోంది.
కవిత తన ‘జాగృతి జనం బాట’ పర్యటనల్లో భాగంగా వారానికో జిల్లాలో పర్యటిస్తూ, హరీశ్ రావు, నిరంజన్ రెడ్డి, జగదీష్ రెడ్డి వంటి మాజీ మంత్రులను టార్గెట్ చేస్తున్నారు. వారిపై అవినీతి ఆరోపణలు గుప్పిస్తూ, పరోక్షంగా కేసీఆర్ ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందనే సంకేతాలను స్వయంగా ఆమె ఇస్తున్నారనే అంశం బీఆర్‌ఎస్‌లో ఆందోళన కలిగిస్తోంది. దీంతో, కవిత వ్యాఖ్యలను లైట్ తీసుకుంటే పార్టీకి మరింత డ్యామేజ్ అవుతుందని, ముఖ్యంగా ప్రత్యర్థి పార్టీలకు అస్త్రంగా మారుతుందని గులాబీ దళం భావిస్తున్నది.
దీంతో, ఇకపై కవిత విషయంలో ఏ మాత్రం సహించేది లేదని బీఆర్‌ఎస్ అధిష్టానం నిర్ణయించినట్లు సమాచారం. ప్రత్యర్థి పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ తరహాలోనే కవితను ట్రీట్ చేయాలని, ఆమె పార్టీ నేతలను టార్గెట్ చేసిన వెంటనే గట్టిగా కౌంటర్ ఇవ్వాలని ముఖ్యనేతలకు ఆదేశాలు వెళ్లినట్లు తెలంగాణ భవన్ వర్గాల టాక్. ఈ పరిణామంతో, తెలంగాణ రాజకీయం మరింత హీటెక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి.









