ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఆరోగ్య భద్రత కల్పించే లక్ష్యంతో ‘యూనివర్సల్ హెల్త్ పాలసీ’ అనే బృహత్తర పథకాన్ని అమలు చేయనుంది. ఈ విధానం ద్వారా పేద, ధనిక అనే తేడా లేకుండా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికీ గరిష్టంగా రూ.25 లక్షల వరకు వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ఏపీ బయోడైవర్సిటీ బోర్డు ఛైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ పాలసీతో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.63 కోట్ల కుటుంబాలకు మేలు జరుగుతుందని ఆయన తెలిపారు.
ఈ పథకం కింద, రూ.5 లక్షల లోపు వార్షికాదాయం ఉన్న కుటుంబాలకు మొదట రూ.2.50 లక్షల వరకు బీమా సంస్థ ద్వారా క్యాష్‌లెస్ వైద్యం అందుతుంది. ఆ తర్వాత అయ్యే ఖర్చును మొత్తం రూ.25 లక్షల వరకు డాక్టర్ ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ భరిస్తుందని విజయ్ కుమార్ వివరించారు. గతంలో ఉన్న వేర్వేరు ప్యాకేజీల విధానానికి స్వస్తి చెప్పి, కూటమి ప్రభుత్వం అన్నింటినీ ఒకే ప్యాకేజీ కిందకు తీసుకొచ్చి, అందరికీ ఒకే ప్రమాణాలతో నాణ్యమైన వైద్యం అందిస్తుందని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2,493 నెట్వర్క్ ఆసుపత్రుల్లోని 31 సూపర్ స్పెషాలిటీ విభాగాల్లో ఈ సేవలు అందుబాటులో ఉంటాయి.
ఈ కొత్త విధానం వల్ల ప్రస్తుత లబ్ధిదారులకు ఎలాంటి నష్టం జరగదని, అలాగే ఆరోగ్యశ్రీ ఉద్యోగుల భద్రతకు కూడా ఢోకా లేదని విజయ్ కుమార్ హామీ ఇచ్చారు. పాలసీ నిర్వహణ సమర్థంగా ఉండేందుకు, రాష్ట్రాన్ని శ్రీకాకుళం నుంచి ఎన్టీఆర్ జిల్లా వరకు జోన్-1గా, గుంటూరు నుంచి రాయలసీమ వరకు జోన్-2గా విభజించినట్లు తెలిపారు. ఈ యూనివర్సల్ హెల్త్ పాలసీతో ఏపీని దేశంలోనే ఆరోగ్య రోల్ మోడల్‌గా నిలపడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు.








