సినిమా పైరసీ వెబ్‌సైట్‌లు ‘ఐబొమ్మ’ మరియు ‘బప్పం టీవీ’ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్ట్ కేసు దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. వెబ్‌సైట్‌లలో బెట్టింగ్ యాడ్స్ (ముఖ్యంగా ‘వన్‌ఎక్స్‌బెట్’, ‘వన్‌విన్’ వంటివి) ప్రదర్శించడం ద్వారా రవి కోట్లాది రూపాయలు అక్రమంగా ఆర్జించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ అక్రమ సంపాదనతో రవి విలాసవంతమైన జీవితాన్ని గడిపాడు. పోలీసులు రవికి చెందిన నాలుగు బ్యాంకు ఖాతాల్లో సుమారు రూ.20 కోట్ల లావాదేవీలు జరిగినట్లు గుర్తించగా, ఇప్పటికే మూడు ఖాతాల్లోని రూ.3.5 కోట్ల నగదును స్తంభింపజేశారు. కేవలం సినిమా పైరసీ ద్వారానే నెలకు సుమారు రూ.11 లక్షల వరకు సంపాదించినట్లు తెలిసింది.
రవి ఈ అక్రమ సంపాదనను ఉపయోగించి హైదరాబాద్‌తో పాటు కరీబియన్ దీవుల్లోనూ ఇళ్లు కొనుగోలు చేశాడు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన రవి, ప్రతి రెండు నెలలకు ఒక కొత్త దేశానికి పర్యటనకు వెళ్లేవాడని, అతనికి యూరోపియన్ దేశాలంటే చాలా ఇష్టమని పోలీసుల విచారణలో తేలింది. రవికి బంధువులు, స్నేహితులతో ఎలాంటి సంబంధాలు లేవని కూడా పోలీసుల వద్ద పేర్కొన్నాడు.
రవిని అరెస్ట్ చేయడానికి పోలీసులు అతని ఇంటికి వెళ్లినప్పుడు, అతను ఏకంగా గంటన్నర పాటు తలుపులు తీయలేదు. ఈ సమయాన్ని ఉపయోగించుకుని రవి తన మొబైల్ మరియు టెలిగ్రామ్ డేటాను డిలీట్ చేసి, ల్యాప్‌టాప్‌ను బాత్రూమ్ రూఫ్‌లో, ఫోన్‌ను అల్మారాలో దాచిపెట్టి సాక్ష్యాలను ధ్వంసం చేసేందుకు ప్రయత్నించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.







