జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నిక పోలింగ్‌కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రేపు (మంగళవారం) ఉదయం పోలింగ్ ప్రారంభం కానుంది. యూసఫ్‌గూడలోని డీఆర్‌సీ సెంటర్‌లో ఈసీ అధికారులు ఎన్నికల సిబ్బందికి ఈవీఎంలను, పోలింగ్ స్టేషన్లను కేటాయించారు. ఎన్నికల సిబ్బంది సాయంత్రం లోగా తమతమ పోలింగ్ స్టేషన్లకు చేరుకుని ఏర్పాట్లు పూర్తి చేయనున్నారు. జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ పోలింగ్ ఏర్పాట్లను స్వయంగా పరిశీలించారు.
పోలింగ్ కేంద్రాల వద్ద భద్రతా ఏర్పాట్ల గురించి జిల్లా ఎన్నికల అధికారి ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ, ఈసారి భద్రత పర్యవేక్షణ కోసం డ్రోన్లను వినియోగిస్తామని తెలిపారు. దీని ద్వారా సెక్యూరిటీ మానిటరింగ్ కట్టుదిట్టంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా, ప్రతి అభ్యర్థి తరఫున ఒక పోలింగ్ ఏజెంట్‌కు పాస్‌ను అందించినట్లు కూడా ఆయన తెలిపారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికపై తెలంగాణ రాష్ట్రం మొత్తం ఆసక్తిగా ఉంది. ఈ ప్రతిష్టాత్మక స్థానం కోసం కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు గెలుపుపై తమ తమ ధీమాను వ్యక్తం చేస్తున్నాయి. పోలింగ్ అనంతరం, ఈ నియోజకవర్గంలో ఓటర్లు ఎవరికి పట్టం కట్టారో ఈ నెల 14న (నవంబర్ 14న) తేలనుంది.









