భారత మహిళల జట్టు తొలిసారిగా వన్డే ప్రపంచకప్ గెలిచి చరిత్ర సృష్టించడంపై దిగ్గజ క్రికెటర్ సునీల్ గవాస్కర్ ప్రశంసల వర్షం కురిపించారు. ఈ విజయం భారత క్రికెట్ ప్రస్థానంలో ఒక చారిత్రాత్మక ఘట్టమని, ఇది యుగయుగాల పాటు గుర్తుండిపోతుందని ఆయన అభిప్రాయపడ్డారు. భారత అమ్మాయిలు దేశానికి ఎంతో ఆనందాన్ని ఇచ్చారని కొనియాడారు.
ఆదివారం నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో జరిగిన ఫైనల్‌లో భారత్.. దక్షిణాఫ్రికాపై అద్భుత విజయం సాధించింది. ఈ విజయంపై సోమవారం తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో గవాస్కర్ ఒక వీడియోను పోస్ట్ చేశారు. “నిన్న డీవై పాటిల్ స్టేడియంలో భారత కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ క్యాచ్ పట్టి జట్టును విశ్వవిజేతగా నిలిపిన క్షణం ఎంత అద్భుతంగా ఉంది. అదొక అపురూపమైన ఘట్టం” అని ఆనందం వ్యక్తం చేశారు.
లీగ్ దశలో వరుసగా మూడు ఓటములతో కష్టాల్లో పడిన భారత జట్టు, ఆ తర్వాత అద్భుతంగా పుంజుకుని నాకౌట్ దశలో తిరుగులేని విజయాలతో ఫైనల్‌కు చేరిన పోరాట స్ఫూర్తిని గవాస్కర్ ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. “భారత అమ్మాయిలు పోరాడిన తీరు అద్భుతం. కెప్టెన్ గొప్ప నాయకత్వ పటిమను, దృఢ సంకల్పాన్ని ప్రదర్శించి ప్రపంచకప్ గెలిచింది. ఇది చిరకాలం గుర్తుంచుకోవాల్సిన విజయం,” అని ప్రశంసించారు.









