వెనెజువెలాతో అమెరికా యుద్ధం చేయడానికి సిద్ధమవుతోందన్న ప్రచారంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పందించారు. యుద్ధం జరిగే అవకాశాలు తక్కువేనని ఆయన అంటూనే, వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురో ఆ పదవిలో ఎంతో కాలం ఉండబోరని అన్నారు. ఒక ఇంటర్వ్యూలో వెనెజువెలాపై యుద్ధం చేస్తారా అని ప్రశ్నించగా, ట్రంప్ “యుద్ధం జరుగుతుందని నేను అనుకోవడం లేదు. కానీ, వారు (వెనెజువెలా అధికార నేతలు) మనతో సరైన రీతిలో ప్రవర్తించడం లేదు” అని సమాధానమిచ్చారు.
కరేబియన్‌లో సైనిక మోహరింపు
గత రెండు నెలలుగా అమెరికా సైన్యం కరేబియన్ సముద్రంలో యుద్ధనౌకలు, యుద్ధవిమానాలు, బాంబర్లు, డ్రోన్లు మరియు గూఢచారి విమానాలను పంపుతోంది. కరేబియన్ ప్రాంతంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా జరుగుతోందని అమెరికా ఆరోపిస్తూ, డ్రగ్స్ రవాణా కాకుండా ఆపేందుకు అక్కడి పడవలపై దాడులు కొనసాగిస్తోందని ట్రంప్ ప్రభుత్వం చెబుతోంది. అయితే, భూతల దాడులు చేస్తారా? అన్న ప్రశ్నకు ట్రంప్ సమాధానం ఇవ్వడానికి నిరాకరిస్తూ, “అది చేయబోతున్నానా? లేదా? అన్నది చెప్పను. వెనెజువెలా విషయంలో నేను ఏం చేయబోతున్నానో చెప్పను” అని అన్నారు.
రష్యా నుంచి తీవ్ర హెచ్చరిక
మాదకద్రవ్యాల వ్యతిరేక యుద్ధం పేరుతో కరేబియన్ ప్రాంతంలో అమెరికా భారీగా సైనిక శక్తిని వాడుతోందని రష్యా తీవ్రంగా ఖండించింది. రష్యా విదేశాంగ మంత్రిత్వశాఖ ప్రతినిధి మారియా జఖరోవా మాట్లాడుతూ, “అమెరికా భారీగా సైనిక శక్తిని వాడుతుండడాన్ని రష్యా తీవ్రంగా ఖండిస్తోంది” అని పేర్కొన్నారు. వెనెజువెలా అధ్యక్షుడు నికొలస్ మదురోకు రష్యా పూర్తి మద్దతు ఇస్తున్నామని, అంతర్జాతీయ చట్టాలను తప్పక పాటించాలని రష్యా అమెరికాను హెచ్చరించింది.









