ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కల్యాణ్ తన శాఖల వ్యవహారాలను చూసుకుంటూనే, అప్పుడప్పుడు లా అండ్ ఆర్డర్ (శాంతి భద్రతల) అంశాలపై ఆరా తీస్తున్నారు. సీఎం తర్వాత అంతటి పోస్టులో ఉన్న పవన్, తన కార్యాలయానికి ఎక్కువగా వస్తున్న పోలీస్, రెవెన్యూ శాఖలకు సంబంధించిన ఫిర్యాదుల మీద రియాక్ట్ అవుతున్నారు. ఇటీవల భీమవరంలో పేకాట జూదాలపై దృష్టి సారించి, డీజీపీని నివేదిక కోరడం చర్చకు దారితీసింది. పవన్ ఈ విధంగా హోం శాఖ వ్యవహారాలపై చొరవ తీసుకోవడం సరికాదంటూ విపక్షాలు అస్త్రంగా మార్చుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
పవన్ కల్యాణ్ చొరవపై విపక్షాలు రాద్దాంతం చేస్తున్నప్పటికీ, కూటమి ప్రభుత్వం మాత్రం ఆయనకు మద్దతుగా నిలుస్తోంది. డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు పవన్ అన్ని శాఖలను పట్టించుకోవడం సంతోషకరమని పేర్కొన్నారు. ముఖ్యంగా, పవన్ దృష్టి పెట్టింది ఒక వ్యసనం (పేకాట జూదం) మీద కాబట్టి, డిప్యూటీ సీఎం హోదాలో ఆయన చొరవ తీసుకోవడం తప్పు లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది. అంతేకాదు, హోంమంత్రి అనిత కూడా తమ మధ్య ఎలాంటి ఇగోలు లేవని, పవన్ పోలీసు ఉన్నతాధికారులను నివేదిక కోరడంలో తప్పేమీ లేదని స్పష్టం చేశారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడిన మొదట్లో కూడా పవన్ కల్యాణ్ శాంతి భద్రతలు సరిగ్గా లేవని వ్యాఖ్యానించి, తానే హోంమంత్రి అయి ఉంటే పరిస్థితి వేరేగా ఉండేది అని కీలక స్టేట్‌మెంట్ ఇచ్చారు. అప్పట్లో ఆ వ్యాఖ్యలు దుమారం రేపినప్పటికీ, తన దృష్టికి వచ్చిన అంశాలపై ఓపెన్‌గా స్పందించడం పవన్ నైజంగా చెబుతున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో పవన్ ‘జోక్యం’ చేసుకుంటున్నారని ప్రచారం జరుగుతున్నప్పటికీ, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సైతం పవన్‌కు అధిక ప్రాధాన్యత ఇస్తుండటంతో, ఆయన చొరవపై జరుగుతున్న రాద్దాంతం అనవసరమన్న టాక్ రాజకీయ వర్గాల్లో బలంగా వినిపిస్తోంది.









