AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

త్వరగా పెళ్లి చేసుకుని ఆరుగురు పిల్లలతో హ్యాపీగా ఉండు బావా – మోహన్‌బాబు

రెబల్ స్టార్ ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా ప్రముఖ నటుడు మంచు మోహన్‌బాబు తనదైన ప్రత్యేక శైలిలో శుభాకాంక్షలు తెలిపారు. మోహన్‌బాబు చేసిన ట్వీట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. “నా ప్రియమైన డార్లింగ్ బావా ప్రభాస్ నువ్వు దేశం గర్వించే వ్యక్తివి. నీకు శతాయుష్షు, ఆరోగ్యం, ఆనందం కలగాలి. త్వరలోనే పెళ్లి చేసుకుని అర డజను (ఆరుగురు) పిల్లలతో సంతోషంగా జీవించాలని కోరుకుంటున్నాను” అంటూ మోహన్‌బాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సరదా వ్యాఖ్యలపై నెటిజన్లు కూడా స్పందిస్తూ రకరకాల కామెంట్లు పెడుతున్నారు.

మోహన్‌బాబు, ప్రభాస్ మధ్య చాలా కాలంగా మంచి అనుబంధం ఉంది. రెబల్‌స్టార్ కృష్ణంరాజుతో కలిసి మోహన్‌బాబు అనేక చిత్రాల్లో నటించారు. ఆయన నట వారసుడైన ప్రభాస్‌తో కూడా మోహన్‌బాబు ఎంతో సఖ్యతగా ఉంటారు. వీరిద్దరు కలిసి పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బుజ్జిగాడు’ మూవీలో నటించారు. అందులో మోహన్‌బాబు హీరోయిన్ త్రిషకి అన్నగా నటించగా, ఆ పాత్ర కారణంగానే ప్రభాస్ అప్పటి నుంచి ఆయన్ని ‘బావ’ అని పిలవడం మొదలుపెట్టారు. ఏ సందర్భం వచ్చినా ఇద్దరూ ‘బావ బావ’ అని పిలుచుకుంటూ తమ ప్రేమ, అభిమానాన్ని చాటుకుంటుంటారు.

ప్రభాస్ పుట్టినరోజు సందర్భంగా మోహన్‌బాబు చేసిన ఈ ఆసక్తికరమైన ట్వీట్‌పై నెటిజన్లు సరదాగా కామెంట్లు పెడుతున్నారు. “అరడజను మంది పిల్లలా.. సరిపోతారా సార్”, “ఈ విషయంలో మంచు విష్ణుతో ప్రభాస్‌కి సలహాలు ఇప్పించండి”, “అక్కడ పెళ్లికే దిక్కులేదంటే అరడజను పిల్లలా” అంటూ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ప్రభాస్‌కి అద్భుతమైన ఆరోగ్యం, అంతులేని ఆనందంతో శతాయుష్షు కలగాలని కోరుకుంటూ, ఈ శుభాకాంక్షలు చెప్పిన మోహన్‌బాబుపై అభిమానులు సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు.

ANN TOP 10