పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా, స్టైలిష్ డైరెక్టర్ సుజీత్ తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘ఓజీ’ (OG). ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదలై కేవలం 10 రోజుల్లోనే రూ. 300 కోట్లకు పైగా వసూళ్లు సాధించి సరికొత్త రికార్డులు సృష్టించింది. అయితే, తాజాగా కన్నడ దర్శకుడు చంద్రు (R. Chandru) ‘ఓజీ’ సినిమాపై షాకింగ్ కామెంట్స్ చేసి కొత్త వివాదానికి తెర తీశారు. తన సినిమాను చూసే ‘ఓజీ’ని తెరకెక్కించారని ఆయన బాంబు పేల్చారు.
దర్శకుడు చంద్రు గతంలో ఉపేంద్ర, సుదీప్ ప్రధాన పాత్రల్లో ‘కబ్జా’ అనే గ్యాంగ్‌స్టర్ కథాంశంతో సినిమా తీశారు. 2023లో వచ్చిన ఈ సినిమాను ప్రేక్షకులు తిరస్కరించడంతో డిజాస్టర్‌గా నిలిచింది. తాజాగా ‘ఓజీ’ సినిమా గురించి మాట్లాడుతూ, “ఓజీ సినిమా చూస్తున్నంత సేపు నాకు నా ‘కబ్జా’ సినిమా గుర్తుకువచ్చింది. చాలా సన్నివేశాలు అలానే ఉన్నాయి. కబ్జా సినిమా చూశాకనే దర్శకుడు ఓజీ సినిమా చేసి ఉంటాడు” అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
చంద్రు చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో తీవ్ర ట్రోలింగ్‌కు దారి తీశాయి. నెటిజన్లు అసలు ‘కబ్జా’ సినిమాకు, ‘ఓజీ’ సినిమాకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా, “నిజం చెప్పాలంటే ‘కేజీఎఫ్’ సినిమాను చూసి ‘కబ్జా’ సినిమా చేశారు, ముందు దాని గురించి మాట్లాడండి” అంటూ దర్శకుడు చంద్రుపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. దీనిపై దర్శకుడు చంద్రు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.









