తమిళనాడులో అన్నాడీఎంకే, బీజేపీ పొత్తు ఖరారు అయింది. వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఈ రెండు పార్టీలు కలిసి పోటీ చేయనున్నాయి. ఈ మేరకు కేంద్ర మంత్రి అమిత్ షా అధికారిక ప్రకటన చేశారు. పళనిస్వామి నాయకత్వంలోనే అన్నాడీఎంకే ఎన్నికలకు వెళుతుందని ఆయన స్పష్టం చేశారు.
అన్నాడీఎంకే అధినేత పళనిస్వామి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలైతో కలిసి చెన్నైలో అమిత్ షా విలేకరుల సమావేశం నిర్వహించారు. 1998లో అప్పటి ముఖ్యమంత్రి జయలలిత నేతృత్వంలో బీజేపీ, అన్నాడీఎంకే కూటమిగా ఏర్పడి లోక్సభ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన విషయాన్నిఆయన గుర్తు చేశారు.
ఈ పొత్తు కోసం అన్నాడీఎంకే ఎలాంటి షరతులు, డిమాండ్లు పెట్టలేదని అమిత్ షా తెలిపారు. అన్నాడీఎంకే అంతర్గత వ్యవహారాల్లో బీజేపీ జోక్యం చేసుకోదని స్పష్టం చేశారు. ఈ పొత్తు రెండు పార్టీలకు లాభదాయకమని ఆయన అభిప్రాయపడ్డారు. సీట్ల కేటాయింపు వంటి అంశాలను త్వరలో నిర్ణయిస్తామని వెల్లడించారు.
స్టాలిన్ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందని, ప్రజల దృష్టిని మరల్చేందుకు సనాతన ధర్మం, త్రిభాషా విధానం వంటి అంశాలను తెరపైకి తెస్తోందని అమిత్ షా విమర్శించారు..