ప్రముఖ నటి, మరాఠీ సినీ దర్శకురాలు రేణు దేశాయ్ తన రెండవ వివాహం గురించి సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించారు. తన వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న అనవసర చర్చలకు స్వస్తి పలకాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఒక పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆమె, తన ఇతర అభిప్రాయాలను పట్టించుకోకుండా కేవలం పెళ్లి గురించే పదే పదే ప్రస్తావిస్తుండడంపై అసహనం వ్యక్తం చేశారు.
“గంటకు పైగా నేను మాట్లాడిన పాడ్‌కాస్ట్‌లో మతం, బంధాలు, సోషల్ మీడియా ప్రభావం వంటి ముఖ్యమైన విషయాల గురించి ఎన్నో విషయాలు చర్చించాను. కానీ, నా రెండవ వివాహానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. నా రెండో పెళ్లి గురించి మాట్లాడితే ఏమైనా ప్రయోజనం కలుగుతుందా?” అని అన్నారు. తన పెళ్లి గురించి ఇప్పటికే చాలాసార్లు మాట్లాడానని, ఇకపై దీనిపై చర్చించవద్దని ఆమె కోరారు. ఇకనైనా తన వ్యక్తిగత జీవితంపై కాకుండా సమాజానికి ఉపయోగపడే విషయాలపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు.
పన్ను విధానాలు, మహిళా భద్రత, ఆర్థికాభివృద్ధి, పర్యావరణ మార్పులు వంటి సామాజిక సమస్యలపై దృష్టి సారించాలని రేణు దేశాయ్ సూచించారు. ఇలాంటి విషయాలపై దృష్టి పెడితే సమాజానికి మేలు జరుగుతుందని అభిప్రాయపడ్డారు. అంతేకాకుండా, పిల్లలకు గాయత్రి మంత్రం కూడా రావడం లేదని, చాలామంది తల్లులకు ఏ మంత్రం దేనికి ఉందో కూడా తెలియదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
బంధాల విషయంలో ప్రజలకు ఓపిక లేదని, తాను విడాకులు తీసుకున్న మహిళను కాబట్టి, తాను ఏం మాట్లాడినా విమర్శిస్తారని అన్నారు. స్త్రీ, పురుషులు ఇద్దరూ సమన్వయంతో పనిచేసినప్పుడే కుటుంబ వ్యవస్థ సాఫీగా సాగుతుందని అభిప్రాయపడ్డారు. తరాలు మారుతున్న కొద్దీ పురుషుల్లో మార్పు వస్తోందని, మగవాళ్లమనే అహంభావం తగ్గుతోందని ఆమె పేర్కొన్నారు. ఇకనైనా తన వ్యక్తిగత జీవితంపై కాకుండా సమాజానికి ఉపయోగపడే విషయాలపై దృష్టి పెట్టాలని ఆమె విజ్ఞప్తి చేశారు.