కేసీఆర్ నయా ప్లానా?
కవితక్క రాకతో పార్టీలో జోష్ వచ్చేనా?
బీఆర్‌ఎస్ పార్టీలో అనూహ్య మార్పులు చోటుచేసుకుంటున్నాయా?.. కేటీఆర్‌ను బాధ్యతల నుంచి తప్పించనున్నారా?.. కేసీఆర్ నయా ప్లానా?.. ఎమ్మెల్సీ కవిత రీ ఎంట్రీతో అవుననే సమాధానం వినవస్తోంది. మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత మళ్లీ రాజకీయాల్లో యాక్టివ్ అయ్యారు. అటు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతూనే ఇటు ప్రజాక్షేత్రంలోనూ అడుగుపెట్టారు. ఇటీవల అదానీ కేసు విషయంలో కవిత కేంద్రంపై విమర్శలు కురిపించిన సంగతి తెలిసిందే. ఆ తరవాత గురుకులంలో ఫుడ్ పాయిజన్ కు గురై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థినిని పరామర్శించి కాంగ్రెస్ సర్కార్ పై విమర్శలు కురిపించారు. దీంతో కవితక్క ఈజ్ బ్యాక్ అని ఆ పార్టీ నేతలు, జాగృతి తమ్ముళ్లు సంబురాలు చేసుకుంటున్నారు. అయితే కవిత రీఎంట్రీ పార్టీ కార్యకర్తల్లో జోష్ పెంచినా?.. అన్న కేటీఆర్ కు రాజకీయ పోటు తప్పదనే వార్తలు గుప్పుమంటున్నాయి.
కేటీఆర్ తీరుతో పార్టీకి తీవ్ర నష్టం..
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కవిత జైలులోనే ఉన్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీని ముందుండి నడిపిస్తున్నారు. ఈ క్రమంలో ప్రభుత్వం ఏర్పడి నెల తిరగకముందే ఆయన విమర్శలు చేయడం పార్టీకి నెగిటివీటీని తెచ్చిపెట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రతి పథకాన్ని విమర్శించడం.. ఏ పని ముందేసుకున్నా ప్రెస్ మీట్ పెట్టి విమర్శించడంతో కేటీఆర్ పై ప్రజలకే కాకుండా సొంతపార్టీ నేతలు సైతం అసహ్యం ఏర్పడిందంట.
అర్బన్‌కు.. రూరల్‌కు తేడాతెలియని కేటీఆర్..
కేవలం సోషల్ మీడియా, యూట్యూబ్ ఛానళ్ల కారణంగానే తాము ఓడిపోయామని ఆయన చెప్పడంతో పాటూ ఇప్పుడు కేవలం సోషల్ మీడియానే నమ్ముకుని రాజకీయాలు చేయడం ఆ పార్టీ నేతలకు సైతం నచ్చడంలేదట. ఇక లోక్ సభ ఎన్నికల సమయంలో ఉద్యమ పార్టీకి ఘోరపరాభవం కలగటానికి కూడా ఆయనే కారణమని విమర్శలు వచ్చాయి. కేటీఆర్ కు అర్బన్ కు రూరల్ కు తేడా తెలియదని బీఆర్‌ఎస్ సోషల్ మీడియా బహిరంగంగా కామెంట్లు చేసింది. కేటీఆర్ హైదరాబాద్ లో ఇచ్చిన స్పీచ్ నే ఆదిలాబాద్ లో ఇచ్చి విమర్శలపాలయ్యారు.
నేటికీ మారని తీరు..
లోక్ సభ ఎన్నికల్లో ఘోరపరాభవం తరవాత కూడా ఆయన తీరుమారలేదు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎలా వ్యవహరించారో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా ఆ తీరుగానే వ్యవహరిస్తున్నారు. దీని ఫలితంగా పార్టీకి చాలా మంది సీనియర్లు దూరం అయ్యారు. జిల్లాలు, గ్రామస్థాయిలోనూ బీఆర్‌ఎస్ చాలా మంది కార్యకర్తలను కోల్పోవాల్సి వచ్చింది. ఈ పరిణామాల నేపథ్యంలో కేసీఆర్ కొడుకు కేటీఆర్ ను కాకుండా కవితను ముందుంచి రాజకీయాలు చేయాలని భావిస్తున్నారట. ఈ నేపథ్యంలోనే జైలుకు వెళ్లొచ్చిన గ్యాప్ లో కేసీఆర్ కూతురుకు రాజకీయ పాఠాలు బోధిస్తున్నారని అప్పట్లో వార్తలు వినిపించాయి.
కవితకు కీలక పదవి..
అంతే కాకుండా కవితను మందుంచి రాజకీయాలు చేసేందుకు త్వరలోనే పార్టీలో కీలక పదవి అప్పగించబోతున్నట్టు ప్రచారం జరగుతోంది. గతంలో బీఆర్‌ఎస్ మహిళా అధ్యక్షురాలిగా గుండు సుధారాణి వ్యవహించిన సంగతి తెలిసిందే. ఆమె పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ లో చేరారు. చాలా కాలం నుంచి∙బీఆర్‌ఎస్ మహిళా అధ్యక్షురాలి స్థానం ఖాళీగానే ఉంది. ఇప్పుడు ఆ స్థానంలో కవితను నియమించబోతున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే కవిత పార్టీలో మరింత కీలకంగా మారే అవకాశం ఉంది. అంతే కాకుండా ఇప్పటికే కేటీఆర్ పై పార్టీలో వ్యతిరేకత నెలకొనగా కవిత జాగ్రత్తగా వ్యవహరిస్తే కేసీఆర్ తరవాత తానే కీలకంగా మారే అవకాశాలు సైతం ఉన్నాయన్న చర్చ జరుగుతోంది.