లగచర్ల దాడి కేసులో అధికారులు విచారణ వేగవంతం చేశారు. కలెక్టర్ పై దాడి ఘటనలో పరిగి డీఎస్పీ కరుణసాగర్ రెడ్డిపై వేటు పడింది. డీఎస్పీని డీజీపీ కార్యాలయానికి అటాచ్ చేస్తూ సంబంధిత అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. అటు మరోవైపు సంగయ్యపల్లి గ్రామానికి చెందిన పంచాయతీ సెక్రటరీగా పని చేస్తున్న రాఘవేందర్ ను కలెక్టర్ సస్పెండ్ చేశారు.
దాడి ఘటనలో రాఘవేందర్ కీలక పాత్ర పోషించినట్లు పోలీసులు గుర్తించారు. లగచర్ల గ్రామస్తులను, రైతులను రాఘవేందర్ రెచ్చగొట్టారని, కలెక్టర్ పై దాడి చేసేలా ఉసిగొల్పారని పోలీసులు నిర్ధారించారు.
లచగర్ల ఘటనను అటు ప్రభుత్వం, ఇటు పోలీస్ శాఖ చాలా సీరియస్ గా తీసుకుంది. కలెక్టర్, అధికారులపై దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఈ ఘటన వెనుక ఎవరున్నా, ఎంతటి వారున్న వదిలేది లేదని ప్రభుత్వం తేల్చి చెబుతోంది. ఈ కేసులో విచారణ వేగవంతం చేసిన పోలీసులు.. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి కూడా ఉన్నారు. మరోవైపు ఈ ఘటనలో ప్రమేయం ఉన్న వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. పంచాయతీ సెక్రటరీ రాఘవేందర్ పై యాక్షన్ తీసుకుంది. కలెక్టర్ అతడిని సస్పెండ్ చేశారు. అటు పరిగి డీఎస్పీపైనా వేటు పడింది.
లగచర్ల దాడి ముమ్మాటికీ కుట్రే..!- విప్ ఆది శ్రీనివాస్..
లగచర్లలో అధికారులపై జరిగిన దాడిని తెలంగాణ సమాజం ఖండిస్తోందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఈ ఘటనపై మాజీ మంత్రి కేటీఆర్ స్పందించడం హాస్యాస్పదమన్నారాయన. నేరెళ్లలో దళితులపై జరిగిన దాడిని కేటీఆర్ మర్చిపోయారా అని నిలదీశారు. నేరెళ్లలో దళితుల మీద జరిగిన దాడిపైన ఎస్సీ కమిషన్ నివేదిక ఇప్పటికీ బయటకు రాలేదన్నారు. దీంతో బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం మరొకటి లేదన్నారు విప్ ఆది శ్రీనివాస్. దళితులు, గిరిజనులపై ప్రేమ ఉన్నట్లు కేటీఆర్ ఇప్పుడు తెగ హడావుడి చేస్తున్నారని ఆయన విమర్శించారు. లగచర్ల దాడి కుట్రపూరితంగానే జరిగిందని ఆయన ఆరోపించారు.