AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

వేముల‌వాడ రాజ‌న్న ఆల‌య అభివృద్ధికి రూ.127 కోట్లు.. ఉత్తర్వులు జారీ చేసిన తెలంగాణ స‌ర్కార్

వేముల‌వాడ రాజ‌రాజేశ్వ‌ర ఆల‌య అభివృద్ధి ప‌నుల కోసం రాష్ట్ర ప్ర‌భుత్వం రూ.127.65 కోట్లు మంజూరు చేసింది. శ్రీ రాజ‌రాజేశ్వ‌ర ఆల‌య కాంప్లెక్స్ విస్త‌ర‌ణ‌, భ‌క్తుల‌కు అవ‌స‌ర‌మైన అధునాత‌న స‌దుపాయాల‌కు రూ.76 కోట్లు కేటాయించారు. ఆల‌యం నుండి మూల‌వాగు బ్రిడ్జి వ‌ర‌కు రోడ్ల విస్త‌ర‌ణ‌కు రూ.47.85 కోట్లు కేటాయించారు. మూల‌వాగులోని బ‌తుక‌మ్మ తెప్ప నుండి జ‌గిత్యాల క‌మాన్ జంక్ష‌న్ వ‌ర‌కు డ్రైనేజీ పైప్ లైన్ నిర్మాణానికి రూ.3.8 కోట్లు కేటాయించారు.

ఇదిలా ఉంటే తెలంగాణ‌లోనే అతిపెద్ద పుణ్యక్షేత్రంగా వేముల‌వాడ రాజ‌రాజేశ్వ‌ర స్వామి ఆల‌యానికి పేరు ఉంది. ఈ ఆల‌యం ఎంతో పురాత‌న‌మైన‌ది కాగా వేల సంఖ్య‌లో భక్తులు వ‌చ్చి ద‌ర్శించుకుంటారు. సోమ‌వారం రోజు భ‌క్తుల సంఖ్య మ‌రింత ఎక్కువ‌గా ఉంటుంది. రాష్ట్రంలోనే అతిపెద్ద మ‌రియు పురాత‌న ఆల‌యం అయిన‌ప్ప‌టికీ ఉమ్మ‌డి పాల‌నలో ఈ ఆల‌యం అభివృద్ధికి నోచుకోలేదు. ప్ర‌త్యేక రాష్ట్రంలో ఆల‌యాన్ని అభివృద్ధి చేస్తార‌ని అంతా భావించారు.

కానీ ప్ర‌త్యేక రాష్ట్రంలోనూ ఆల‌య అభివృద్ధిపై గ‌త ప్ర‌భుత్వం దృష్టి పెట్ట‌లేదు. దీంతో కాంగ్రెస్ ఎన్నిక‌ల స‌మ‌యంలో వేముల‌వాడ ఆల‌యాన్ని అభివృద్ధి చేస్తామ‌ని హామీ ఇచ్చింది. ఈ నేప‌థ్యంలోనే ఇచ్చిన మాట ప్ర‌కారం ఆల‌య అభివృద్ధి కోసం నిధులు విడుద‌ల చేస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. మ‌రోవైపు ఈ నెల 20న సీఎం రేవంత్ రెడ్డి వేములవాడలో ప‌ర్య‌టించ‌నున్నారు. స్వామివారిని ద‌ర్శించుకోవ‌డంతో పాటూ వేములవాడ సభలో గల్ఫ్ బాధిత కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా పంపిణీ చేయనున్నారు.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10