AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

నేతలకూ బిగుస్తున్న ‘ఫోన్‌’ తీగలు

– ఇప్పటికే నలుగురు బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు
– త్వరలో మరికొంత మందికి..
– ఏ క్షణమైనా స్వదేశానికి రానున్న ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావు
– ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు దర్యాప్తు ముమ్మరం

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు ఆసక్తికర మలుపులు తిరుగుతోంది. ఉమ్మడి నల్గొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల చుట్టూ ఈ వ్యవహారం నడుస్తోంది. తాజాగా ఈ కేసులో ఈ రెండు జిల్లాలకు చెందిన నలుగురు బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ అయ్యాయని తెలుస్తోంది. అందులో నకిరేకల్‌ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య కూడా ఉన్నారు. ఈ కేసులో భాగంగా గురువారం విచారణకు హాజరు కానున్నారు లింగయ్య. ఫోరెన్సిక్‌ రిపోర్ట్‌ నివేదిక ఆధారంగా పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఈ కేసులో నిందితులతో బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యేలు పలుమార్లు మాట్లాడారు. త్వరలో మరికొంత మంది రాజకీయ నేతలకు పోలీసులు నోటీసులు ఇవ్వనున్నారని సమాచారం.

ఏ క్షణమైనా స్వదేశానికి..
ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో భాగంగా ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌ రావును భారత్‌కు రప్పించేందుకు పోలీసులు ముమ్మరంగా ప్రయత్నిస్తున్నారని తెలిసింది. ఈ మేరకు ఇంటర్‌ పోల్‌కు రెడ్‌ కార్నర్‌ నోటీస్‌ చేరవేశారని వినిపిస్తోంది. ప్రభాకర్‌ రావు పాస్‌పోర్ట్‌ రద్దుకు సంబంధించి విదేశాంగ శాఖకు కూడా సమాచారం అందజేశారట. ఆయన్ను ఏ క్షణమైనా స్వదేశానికి రప్పించే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభాకర్‌ రావును విచారిస్తే ఈ కేసులో కీలక పురోగతి ఉండే ఛాన్స్‌ ఉంది. అందుకే ఆ దిశగా పోలీసులు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.

బిగుస్తున్న ఉచ్చు
రాష్ట్రాన్ని కుదిపేసిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం పోలీసు అధికారులకే పరిమితం అవుతుందని అనుకున్నారు. కానీ ఈ వ్యవహారంతో సంబంధాలు ఉన్న బీఆర్‌ఎస్‌ మాజీ ఎమ్మెల్యేలకూ నోటీసులు జారీ అవడం ప్రకంపనలు రేపుతోంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని మునుగోడు ఉపఎన్నిక టైమ్‌లో విపరీతంగా ఫోన్‌ ట్యాపింగ్‌ చేశారని, గత సర్కారు దీనిపై బాగానే ఆధారపడిందని వినికిడి. అందుకే ఆ జిల్లా నేతల చుట్టూ ఉచ్చు బిగుస్తోందని తెలుస్తోంది. జిల్లాకు చెందిన చిరుమర్తి లింగయ్యతో పాటు మాజీ ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌ రెడ్డి (భువనగిరి), బొల్లం మల్లయ్య యాదవ్‌ (కోదాడ)కు కూడా పోలీసులు నోటీసులు జారీ చేశారని సమాచారం. వీరిలో తొలుత చిరుమర్తికి నోటీసులు ఇచ్చారని తెలుస్తోంది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10