దాడి కేసులో కీలక సూత్రధారిగా మాజీ ఎమ్మెల్యే
పరారీలో ప్రధాన నిందితుడు సురేశ్
గాలిస్తున్న పోలీస్ ప్రత్యేక బృందాలు
వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై దాడి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. కొడంగల్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్ నేత పట్నం నరేందర్‌రెడ్డిని పోలీసులు బుధవారం ఉదయం అరెస్ట్ చేశారు. హైదరాబాద్‌లోని కేబీఆర్ పార్క్‌లో మార్నింగ్ వాక్ చేస్తుండగా ఆయనను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నరేందర్ రెడ్డిని వికారాబాద్ డీటీసీ సెంటర్‌కు తరలించారు. అనంతరం వైద్య పరీక్షలు చేయించారు. కోర్టులో హాజరు పరిచే అవకాశం ఉంది. కొడంగల్ దాడుల కేసులో కీలక సూత్రధారిగా పట్నం నరేందర్ రెడ్డి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.
పరారీలో ప్రధాన నిందితుడు..
లఘుచర్లలో అధికారులపై దాడి ఘటనలో ప్రధాన నిందితుడు సురేష్ పరారీలో ఉన్నాడు. మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి అనుచరుడు సురేష్.. అధికారులను ప్రజా అభిప్రాయసేకరణ కోసం గ్రామానికి రమ్మని సురేష్ పిలిచాడు. అనంతరం అధికారులపై దాడి ఘటన నుంచి ఇప్పటివరకు పరారీలోనే ఉన్నాడు. అతని కోసం పోలీస్ ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. దాడి జరిగిన కొన్ని గంటలకు ముందే పట్నం నరేందర్ రెడ్డితో సురేష్ దాదాపు 42 సార్లు ఫోన్‌లో మాట్లాడినట్లు గుర్తించారు. సురేష్‌తో మాట్లాడుతూ ఆరు సార్లు కేటీఆర్‌తో కూడా ఫోన్‌లో మాట్లాడినట్లు పట్నం నరేందర్ రెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.
భారీగా పోలీసుల మోహరింపు..
ఈ క్రమంలో పరిగి పోలీసు స్టేషన్ వద్ద భారీగా పోలీసులు మోహరించారు. వికారాబాద్ డీటీసీ సెంటర్ నుంచి పట్నం నరేందర్ రెడ్డి పరిగి పోలీస్‌స్టేషన్‌కు తరలించే అవకాశం ఉన్న నేపథ్యంలో పరిగి పోలీసు స్టేషన్‌కు రెండు వ్యాన్‌లలో పోలీసు బలగాలు వెళ్లాయి. స్టేషన్ దరిదాపుల్లోకి ఎవరినీ పోలీసులు అనుమతించడంలేదు.
రాష్ట్ర వ్యాప్తంగా కలకలం
కాగా వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై దాడి ఘటన రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. ఓవైపు బీఆర్‌ఎస్ పార్టీ నేతల హస్తం ఈ దాడి వెనుక ఉందనే ఆరోపణలు వినిపిస్తుండగా.. తమపై కాంగ్రెస్ కుట్ర పన్నుతోందని గులాబీ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. దాడిలో పాల్గొన్న నిందితుల్లో ఒకరు పట్నం నరేందర్ రెడ్డితో ఎక్కువసార్లు ఫోన్లు మాట్లాడినట్లు పోలీసులు గుర్తించినట్లు తెలుస్తోంది. దీంతో పట్నం నరేందర్ రెడ్డిని విచారించేందుకు అదుపులోకి తీసుకున్నారు.
జరిగింది ఇదీ..
వికారాబాద్ జిల్లా దుద్యాల మండలం.. లగచర్ల, పోలేపల్లిలో 1,350 ఎకరాల్లో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కోసం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. తొలుత ఫార్మా విలేజ్ ఏర్పాటు చేద్దామని ప్రభుత్వం భావించింది. దీనికి ఆయా గ్రామస్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ క్రమంలో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. అందులోభాగంగా ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందుకోసం సోమవారం.. దుద్యాలలో అధికారులు గ్రామ సభ, ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు.
కలెక్టర్‌పై దాడి..
లగచర్ల, పోలేపల్లిలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం వెళ్లిన జిల్లా కలెక్టర్‌పై గ్రామస్తులు దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనకు సంబంధించి బీఆర్‌ఎస్ నేతలతోపాటు పలువురిపై పోలీసులు ఇప్పటికే కేసులు నమోదు చేశారు. జిల్లా కలెక్టర్‌పై దాడికి దిగేలా ప్రజలను రెచ్చగొట్టిన వ్యక్తిని పోలీసులు గుర్తించారు. నిందితుడు పట్నం నరేందర్ రెడ్డి ప్రధాన అనుచరుడు సురేశ్ అని పోలీసులు స్పష్టం చేశారు. ఈ దాడి జరిగే సమయానికి ముందు పట్నం నరేందర్ రెడ్డితో పదుల సంఖ్యలో ఫోన్ కాల్ చేసి సురేశ్ మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు.
ఇక పట్నం నరేందర్ రెడ్డి సైతం.. ఓ వైపు సురేశ్‌తో మాట్లాడుతూనే.. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్‌తో ఫోన్లో మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ అంశాన్ని వెలుగులోకి తీసుకు వచ్చేందుకు డీజీపీ ఇప్పటికే సమగ్ర దర్యాప్తునకు ఆదేశించారు. పట్నం నరేందర్ రెడ్డికి ప్రధాన అనుచరుడుగా ఉన్న సురేశ్‌పై ఇప్పటికే రేప్ కేసుతో సహా వివిధ కేసులు సైతం నమోదయ్యాయి. అయితే గతంలో సురేష్‌పై నమోదు అయిన కేసులను తొలగించేందుకు పట్నం నరేందర్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు పోలీసుల విచారణలో బహిర్గతమైంది.