AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

మెఘా కంపెనీకి కాంట్రాక్టు రద్దు.. గత ప్రభుత్వం ఇచ్చిన టెండర్‌‌పై సర్కార్ కీలక నిర్ణయం

గోదావరి ఫేజ్ 2లో భాగంగా హైదరాబాద్ శివార్లలో గత ప్రభుత్వం తలపెట్టిన కేశవాపురం రిజర్వాయర్ టెండర్ల విషయంలో సర్కార్ (Telangana Govt) కీలక నిర్ణయం తీసుకుంది. 2017లో ఇచ్చిన కేశవాపురం కాంట్రాక్టును రద్దు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గోదావరి జలాలను కొండపోచమ్మసాగర్ నుంచి కేశవాపురం రిజర్వాయర్‌కు అక్కడి నుంచి హైదరాబాద్‌కు తాగునీటి అవసరాల పేరిట గత ప్రభుత్వం ప్రాజెక్టును డిజైన్ చేసిన విషయం తెలిసిందే. మెఘా ఇంజనీరింగ్​ కంపెనీకి ఇచ్చిన ఈ కాంట్రాక్టును రద్దు చేస్తూ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, అర్బన్ డెవెలప్‌మెంట్ ఇంజనీరింగ్ విభాగం బుధవారం జీవో జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో కేశవాపురం రిజర్వాయర్.. అందులో భాగంగా చేపట్టే పనులకు అయ్యే దాదాపు రూ.2 వేల కోట్ల ఖర్చు ఆదా కానుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి.

కొత్త ప్రతిపాదనలు

అదే ఖర్చుతో గోదావరి ఫేజ్ 2 స్కీమ్‌ను మల్లన్నసాగర్ నుంచి ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల వరకు పొడిగించి, హైదరాబాద్ గ్రేటర్ సిటీ తాగునీటి అవసరాలకు తాగునీటిని అందించేలా రాష్ట్ర ప్రభుత్వం కొత్త ప్రతిపాదనలు తీసుకొచ్చింది. హైదరాబాద్‌కు 10 టీఎంసీల తాగు నీటిని సరఫరా చేయటంతో పాటు జంట జలాశయాలకు 5 టీఎంసీల నీటిని అందించేలా మల్లన్నసాగర్ నుంచి బహుళ ప్రయోజనాలుండేలా 15 టీఎంసీల నీటిని పంపింగ్ చేసే ప్రాజెక్టు చేపట్టాలని ఇటీవలే రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. త్వరలోనే ఈ పనులకు టెండర్లు పిలవాలని హైదరాబాద్ వాటర్ బోర్డ్ అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు.

ఆరేళ్లు అయినా…

పాత టెండర్ల ప్రకారం ఎల్లంపల్లి నుంచి వచ్చే గోదావరి నీళ్లను మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మ సాగర్‌కు అక్కడి నుంచి లిఫ్ట్ చేసి కేశవాపురం చెరువును నింపుతారు. కేశవాపురం చెరువును 5 టీఎంసీల నీటిని నిల్వ చేసే రిజర్వాయర్‌గా నిర్మించనున్నారు. అక్కడి నుంచి ఘన్‌పూర్​ మీదుగా హైదరాబాద్‌కు 10 టీఎంసీల తాగునీటి అవసరాలకు సరఫరా చేసేలా ప్లాన్‌ను సిద్ధం చేశారు. అయితే ఆరేండ్లై పనులు ప్రారంభంకానీ పరిస్థితి. భూసేకరణ చిక్కులతో పాటు అనాలోచితమైన అలైన్మెంట్ కారణంగా పనులు ముందుకు సాగలేదు. గత ప్రభుత్వం అటవీ భూములు, రక్షణ శాఖ భూముల నుంచి ప్రాజెక్టును డిజైన్ చేయటం, ఎంచుకున్న పైపులైన్ రూట్ సరిగ్గా లేకపోవటంతో పనులు ముందుకు సాగలేదని రేవంత్ సర్కార్ చెబుతోంది. గత ప్రభుత్వం హయాంలో ఈ టెండర్లను మెఘా కంపెనీ దక్కించుకుంది. అయితే టెండర్లను దర్కించుకున్నప్పటికీ పనులు చేపట్టకుండా మేఘా కంపెనీ వదిలేసింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10