జానపద గాయని, పద్మ భూషణ్ శారదా సిన్హా (Sharada sinha -72) ఇకలేరు. ఢిల్లీ ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి ఆమె తుదిశ్వాస విడిచారు. 2017 నుంచి మల్టిపుల్ మైలోమాతో బాధపడుతున్నారు. మంగళవారం మధ్యాహ్నాం అనారోగ్యానికి గురవడంతో కుటుంబ సభ్యులు ఎయిమ్స్‌లో చేర్చారు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడుతుండటంతో వెంటిలేటర్‌పై కొన్ని గంటలపాటు చికిత్స అందించారు. అయినా ఆమె ప్రాణాలు దక్కలేదు.
బిహార్‌కు చెందిన శారదా.. మైథిలి భాషలో జానపదాలు పాడుతూ కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత భోజ్‌పురి, హిందీ తదితర భాషల్లోనూ ఫోక్ సాంగ్స్ పాడారు. ‘బిహార్ ఉత్సవ్’ వంటి ఎన్నో వేడుకల్లో ప్రదర్శనలిచ్చారు. హిందీలో ‘మైనే ప్యార్ కియా’, గ్యాంగ్స్ ఆఫ్ వాసేపుర్–2, చార్‌ఫుటియా ఛోకరె’ వంటి సినిమాల్లోనూ ఆమె పాడారు. బిహార్ కోకిలగా పేరు తెచ్చుకున్న శారదా 1991లో పద్మశ్రీ, 2018లో పద్మ భూషణ్ అవార్డులు అందుకున్నారు.