కాంగ్రెస్ హైకమాండ్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కులగణన కార్యక్రమం. బుధవారం నుంచి తెలంగాణ వ్యాప్తంగా ఈ కార్యక్రమం మొదలుకానుంది. ఈ నేపథ్యంలో మంగళవారం హైదరాబాద్‌కు రానున్నారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ.
కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ రాయ్‌బరేలి నుంచి మంగళ వారం సాయంత్రం హైదరాబాద్‌కు రానున్నారు. ప్రత్యేక విమానంలో నేరుగా బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుంటారు.
అక్కడి నుంచి రోడ్డు మార్గంలో ట్రావెల్ చేసి సాయంత్రం ఐదున్నర గంటలకు బోయన్ పల్లిలో గాంధీ ఐడియాలాజీ సెంటర్‌కు వెళ్తారు. గంటన్నరపాటు కులగణనపై సదస్సు జరగనుంది. ఈ సమావేశానికి 400 మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాలకు చెందిన కవులు, కళాకారులు, మేధావులు హాజరవుతారు. కులగణనపై మేధావులు, వివిధ సంఘాల నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటారు.
ఈ నేపథ్యంలో బోయిన్‌పల్లిలో గాంధీ ఐడియాలజీ సెంటర్లో విస్తృతంగా ఏర్పాటు చేపట్టారు. ఏర్పాట్లను మంత్రి శ్రీధర్‌బాబుతోపాటు పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ సందర్శించి పరిశీలించారు. భద్రతా పరమైన ఏర్పాట్లపై పోలీసు ఉన్నతాధికారులతో చర్చించారు.
సదస్సు వేదికపై రాహుల్ తోపాటు సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి, పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్, రాష్ట్ర ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షీ మాత్రమే ఉంటారు. సదస్సు పూర్తి అయిన తర్వాత పార్టీ నేతలతో సమావేశం కానున్నారు రాహుల్‌గాంధీ.
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం ప్రమాణ స్వీకారానికి హాజరయ్యారు రాహుల్‌గాంధీ. దాదాపు ఏడాది తర్వాత హైదరాబాద్‌కు అగ్రనేత రానుండడంతో భారీ ఎత్తున స్వాగతం పలికేందుకు ఏర్పాట్లలో నిమగ్నమైంది కాంగ్రెస్ పార్టీ. అనంతరం రాత్రి ఏడున్నర గంటలకు హైదరాబాద్ నుంచి నేరుగా ఢిల్లీకి వెళ్లనున్నారు రాహుల్‌గాంధీ.