AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

బీజేపీలో ఎమ్మెల్సీ ఎన్నికల చిచ్చు.. ఆయనకు టికెట్‌ ఇస్తే ప్రచారం చెయ్యం.. తెగేసిచెప్పిన కేడర్‌

తెలంగాణ బీజేపీలో ఎమ్మెల్సీ ఎన్నికల చిచ్చు మొదలైంది. మూడు సీట్ల కోసం పార్టీలో గట్టి పోటీ నెలకొంది. కొంతమంది కార్పొరేట్లు వీటిపై ఫోకస్ చేసినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టికెట్ల పంచాయితీ తెగకపోవడంతో ఢిల్లీ నుంచి పార్టీ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్ రానున్నారు.

తెలంగాణ మూడు ఎమ్మెల్సీ సీట్లకు మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి. అందులో రెండు టీచర్, ఒకటి గ్రాడ్యుయేట్ స్థానానికి ఎన్నికలు జరగనున్నాయి. అభ్యర్థుల ఎంపికపై కమిటీలు వేయడంతో కసరత్తు మొదలైపోయింది. అయితే అభ్యర్థుల ఎంపిక తలనొప్పిగా మారింది. ఎక్కువ మంది రేసులో ఉండడంతో ఎవరికి టికెట్ ఇవ్వాలన్న దానిపై తర్జనభర్జన పడుతోంది.

కరీంనగర్ టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థిపై భిన్నాభిప్రాయాలు మొదలైపోయాయి ఆ ప్రాంతానికి చెందినవారికి కాకుండా హైదరాబాద్ వ్యక్తికి టికెట్ ఇవ్వడాన్ని కొందరు జీర్ణించుకోలేక పోతున్నారు. ఈ వ్యవహారంపై తెలంగాణ బీజేపీ ఉపాధ్యాయ సంఘం, ఏబీవీపీ సంఘాలతోపాటు కొందరు నేతలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

అంతేకాదు ఓ అడుగు ముందుకేసి ప్రధాన కార్యదర్శి బీఎస్ సంతోష్‌కు ఫిర్యాదు చేసినట్టు అంతర్గత సమాచారం. స్థానిక నేతలుండగా హైదరాబాద్‌కి చెందిన ఓ స్కూల్ మేనేజ్‌మెంట్ అధినేతకు టికెట్ ఇవ్వడాన్ని తప్పుబడుతున్నారట.

ఇది ముమ్మాటికీ సంఘ్ నిబంధలకు విరుద్దమని ఆర్గ్యుమెంట్ చేస్తున్నారట. ఒకవేళ స్కూల్ మేనేజ్‌మెంట్ అధిపతికి టికెట్ ఇస్తే.. ప్రచారం చేయమని తెగేసి చెప్పేశారట. దీంతో ఏం చెయ్యాలో తెలియక దిక్కుతోచని పరిస్థితిలో పడింది ఎమ్మెల్సీ ఎంపిక కమిటీ.

ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌ రానున్నారు పార్టీ ప్రధాన కార్యదర్శి సునీల్ బన్సల్. ఈ క్రమంలో పార్టీ నేతలు, కమిటీ సభ్యులతో ప్రత్యేకంగా సమావేశం కావాలని నిర్ణయించుకున్నారట. తొలుత విడివిడిగా భేటీ కానున్నారు. ఆ తర్వాత అందరితో సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు  ఆ పార్టీ వర్గాల మాట. దీంతో టికెట్లపై క్లారిటీ రావచ్చని అంటున్నారు నేతలు.

ANN TOP 10