AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

సీఎం రేవంత్‌ మార్క్‌.. ప్రపంచమంతా ఇటువైపు చూసేలా ప్రగతి దిశగా ప్రణాళికలు

ఫ్యూచర్‌ సిటీ వైపు అడుగులు
జాతీయ క్రీడల నిర్వహణకు సిద్ధం
త్వరలో స్పోర్ట్స్‌ యూనివర్శిటీ బిల్లు..
నగరంలో మరో భారీ ఐకానిక్‌ నిర్మాణం

పాలనలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మార్క్‌.. తనదైనశైలితో రాష్ట్రాన్ని ప్రగతిబాట పట్టిస్తున్నారు. ఫ్యూచర్‌ సిటీ వైపు అడుగులు శరవేగంగా పడుతున్నాయి. అంతేకాదు.. రాబోయే రెండేళ్లలో జాతీయ క్రీడలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది రేవంత్‌ సర్కార్‌. త్వరలో స్పోర్ట్స్‌ యూనివర్శిటీ బిల్లు తీసుకొచ్చేందుకు సిద్ధమవుతోంది. మరోవైపు ప్రపంచమంతా భాగ్యనగరం వైపు చూసేలా అభివృద్ధి ప్రణాళికలు రచిస్తున్నారు. గుజరాత్‌లో పటేల్‌ విగ్రహం మాదిరిగా.. హైదరాబాద్‌ బాపూఘాట్‌లో మహాత్మా గాంధీ భారీ విగ్రహం ఏర్పాటు చేపడుతున్నారు. నగరంలో ఓ మీడియా సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. రాష్ట్ర అభివృద్ధి ప్రణాళికల్లో మూసీ రివర్‌ఫ్రంట్‌ డెవలప్‌మెంట్, ఫ్యూచర్‌ సిటీ ఆలోచనలను వివరించారు. అంతర్జాతీయస్థాయిలో మహాత్మా గాంధీ ఐడియాలజీ కేంద్రంగా బాపూఘాట్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పారు.

హైదరాబాద్‌లో గాంధీ విగ్రహం
మూసీ, ఈసా నదుల కలయిక ప్రాంతమైన బాపూఘాట్‌ వద్ద ప్రపంచంలోనే అత్యుత్తమంగా గాంధీ స్మారకాన్ని నిర్మించతలపెట్టామని సీఎం రేవంత్‌ రెడ్డి వెల్లడించారు. దేశ ప్రగతిలో దక్షిణాది రాష్ట్రాల పాత్ర, రైజింగ్‌ తెలంగాణ, రైజింగ్‌ హైదరాబాద్‌ లక్ష్యాలపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రపంచమంతా హైదరాబాద్‌ నగరం వైపు చూసేలా.. అంతర్జాతీయస్థాయిలో గాంధీ ఐడియాలజీ కేంద్రంగా బాపూఘాట్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. గుజరాత్‌లో వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహంలా.. హైదరాబాద్‌లో గాంధీజీ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు.

కాంగ్రెస్‌ పాలనలోనే అనేక సంస్కరణలు..
తొలి ప్రధాని జవహర్‌ లాల్‌ నెహ్రూ నుంచి కాంగ్రెస్‌ ప్రధానులు దేశంలో తీసుకొచ్చిన అనేక సంస్కరణల ఫలితాలను ఈ సందర్భంగా రేవంత్‌ వివరించారు. ప్రధానంగా బహుళార్థ సాధక ప్రాజెక్టులు, విద్య, హరిత విప్లవం, బ్యాంకుల జాతీయీకరణ, 73–74 వ రాజ్యాంగ సవరణలు, శాస్త్ర సాంకేతిక రంగంలో తీసుకొచ్చిన విప్లవం, 18 సంవత్సరాలకే ఓటు హక్కు కల్పన, తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలు దేశ ప్రగతికి ఏ విధంగా తోడ్పడిందీ వివరించారు.

మోదీకి పార్టీలను చీల్చడమే తెలుసు..
ప్రధాని నరేంద్ర మోదీ మాత్రం.. పార్టీలను చీల్చడం, ప్రభుత్వాలను పడగొట్టడం తప్ప ఏమీ చేయలేదన్నారు. ఉత్తర, దక్షిణ భారత్‌ అని విభజన తేవడానికి ప్రయత్నిస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. దక్షిణాదిపై ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోందన్నారు. పన్నుల వాటాల్లో దక్షిణాది రాష్ట్రాలకు హక్కుగా రావలసిన నిధులు ఇవ్వటం లేదన్నారు. దీనిపై దక్షిణాది రాష్ట్రాల సీఎంలు కేంద్రంపై ఒత్తిడి పెంచే ఆలోచన ఉందని.. అవసరమైతే ముఖ్యమంత్రుల సదస్సు నిర్వహణకు తానే చొరవ తీసుకుంటానని చెప్పారు. దేశం ప్రగతిబాటలో పయనించడానికి అన్ని రాష్ట్రాలు సమంగా అభివద్ధి చెందాల్సిన అవసరం ఉందని నొక్కిచెప్పారు.

వ్యతిరేకిస్తున్న బీజేపీ, బీఆర్‌ఎస్‌..
మూసీ పునరుజ్జీవాన్ని, బాపూఘాట్‌ అభివృద్ధిని బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు వ్యతిరేకిస్తున్నాయని రేవంత్‌ అన్నారు. గుజరాత్‌లో సబర్మతి రివర్‌ ఫ్రంట్‌ నిర్మించారు కదా.. తాము మూసీ పునరుజ్జీవం చేస్తామంటే బీజేపీ నేతలు అడ్డుకుంటున్నారెందుకు ? అని ప్రశ్నించారు. తాము గుజరాత్‌కు పోటీ ఇవ్వబోతున్నామని అందుకే బీజేపీ నేతలు అడ్డుకుంటున్నారన్నారు. ఎంతో మంది యువకుల త్యాగాలతో తెలంగాణ ఏర్పడిందని గుర్తుచేస్తూ రాష్ట్ర ప్రగతి విషయంలో కొందరు అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని అన్నారు. యువకుల బలిదానాలతో ఏర్పడిన తెలంగాణను… రైజింగ్‌ తెలంగాణగా, రైజింగ్‌ హైదరాబాద్‌గా తీర్చిద్దడంలో అందరూ సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

తెలంగాణ క్రీడా విధానంపై..
జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో తెలంగాణ క్రీడా విధానంపై ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి. తెలంగాణ స్పోర్ట్స్‌ పాలసీలో భాగమైన యంగ్‌ ఇండియా ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ స్పోర్ట్స్‌ యూనివర్సిటీ, యంగ్‌ ఇండియా స్పోర్ట్స్‌ అకాడమీ, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణకు సంబంధించి కీలక అంశాలపై చర్చించారు. జిల్లాలు, రాష్ట్ర, నేషనల్, ఇంటర్నేషనల్‌ స్థాయి గేమ్స్‌ క్యాలెండర్‌ను వెంటనే రూపొందించాలన్నారు. రాబోయే రోజుల్లో జాతీయ క్రీడలకు ఆతిధ్యమిచ్చేలా ఇండియన్‌ ఒలింపిక్స్‌ అసోసియేషన్‌ ను సంప్రదింపులు చేయాలన్నారు. సీఎం రేవంత్‌ దూకుడు చూసి ఆధికారులే ఆశ్చర్యపోవడం కొసమెరుపు.

ANN TOP 10