కొండా సురేఖ తనపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో కోర్టు మంత్రి కొండా సురేఖకు మొట్టికాయలు వేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతరకరంగా ఉన్నాయంటూ మండిపడింది. ఓ బాధ్యత గల మహిళ మంత్రి ఇలాంటి కామెంట్స్ చేయటం ఆశ్చర్యాన్ని కలిగిస్తుందని పేర్కొంది. కేటీఆర్ పై కొండా సురేఖ వ్యాఖ్యలను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు సీరియస్‌గా పరిగణించింది. భవిష్యత్ లో ఇంకెప్పుడూ ఇలాంటి అడ్డగోలు వ్యాఖ్యలను కేటీఆర్ పై చేయవద్దని కొండాను సురేఖను ఆదేశించింది.
అత్యంత జుగుప్సాకరంగా ఉన్న ఆ వ్యాఖ్యలను మీడియా, సోషల్ మీడియా, వెబ్ సైట్లు, అన్ని సోషల్ మీడియా ఫ్లాట్ ఫామ్స్ నుంచి తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. యూట్యూబ్, ఫేస్ బుక్, గూగుల్ సంస్థలకు కూడా ఈ వ్యాఖ్యలు ఉన్న వీడియోలను తొలగించాలని ఆదేశాలు జారీ చేసింది. కొండా సురేఖ వ్యాఖ్యలను ప్రసారం చేసిన, కథనాలు ప్రచురించిన మీడియా సంస్థలకు కూడా కోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ కామెంట్లకు సంబంధించిన అన్ని కథనాలను సోషల్ మీడియా నుంచి తొలగించాలని ఆయా సంస్థలను కోరింది. కొండా సురేఖ వ్యాఖ్యలు సమాజంలో చెడు ప్రభావాన్ని చూపుతాయని ఆమె వ్యాఖ్యలకు సంబంధించిన అన్ని కథనాలు, వీడియోలు పబ్లిక్ డొమైన్ లో ఉండవద్దని కోర్టు తెలిపింది.









