AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

ఇబ్రహీంపట్నంలో మిస్సింగ్.. ఉప్పల్లో ప్రత్యక్షం.. పాఠశాల నుంచి తప్పిపోయిన విద్యార్థి

తల్లిదండ్రుల చెంతకు నితిన్

ఇబ్రహీంపట్నం, ఏఎన్ఎన్ : తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల ఇబ్రహీంపట్నంలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి నితిన్ అదృశ్యమై ఉప్పల్ లో ప్రత్యక్షమయ్యాడు. బాలుడిని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యాచారం మండలం, మేడిపల్లి గ్రామానికి చెందిన గడ్డం మల్లేశ్ కుమారుడు గడ్డం నితిన్(14) ఇబ్రహీంపట్నం సాంఘిక సంక్షేమ బాలుర పాఠశాలలో 9వ తరగతి చదువుతున్నాడు. పాఠశాలలో పరీక్షలు జరుగుతున్న వేళ, మంగళవారం ఉదయం పాఠశాల ప్రాంగణంలో కనబడకపోవడంతో క్లాస్ టీచర్ విచారించగా, పాఠశాల నుంచి తప్పిపోయినట్లు నిర్ధారించుకొన్నారు.

హాస్టల్ చుట్టుపక్కల వెతికినా కనబడకపోవడంతో, పాఠశాల ప్రిన్సిపాల్ మెర్సీ వరూధిని ఆదేశాల మేరకు హాస్టల్ వార్డెన్ ఇబ్రహీంపట్నం పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న ఇబ్రహీంపట్నం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ సత్యనారాయణ, సీసీ ఫుటేజ్ ఆధారంగా విద్యార్థి నితిన్ ఎటు వెళ్లి ఉంటాడు అనే కోణంలో దర్యాప్తు చేస్తూ గాలింపు చర్యలు చేపట్టారు. విద్యార్థిని వెతకడానికి ఐదు బృందాలను ఏర్పాటు చేశారు.

బుధవారం మధ్యాహ్న సమయంలో విద్యార్థి నితిన్ తన తల్లికి అతను ఉన్నచోట నుంచి వేరొకరి ఫోనుతో ఫోన్ చేసి నేను ఉప్పల్ లో ఉన్నానని తెలపడంతో విద్యార్థి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు, పాఠశాల సిబ్బంది ఊపిరి పీల్చుకున్నారు. సమాచారం అందుకుని వెంటనే అప్రమత్తమైన ఇబ్రహీంపట్నం పోలీసులు, సిఐ సత్యనారాయణ ఉప్పల్ పోలీసులకు సమాచారం అందించడంతో అక్కడి సిబ్బంది విద్యార్థి ఉన్నచోటకు వెళ్లి సురక్షితంగా తీసుకురావచ్చారు. విద్యార్థి నితిన్ ను అతని తల్లిదండ్రులకు అప్పగించినట్లు పోలీసులు తెలిపారు.

ANN TOP 10