(అమ్మన్యూస్, హైదరాబాద్):
డీజేను శాశ్వతంగా బ్యాన్ చేయాలని మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ డిమాండ్ చేశారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డీజే డ్యాన్సులతో యువత పక్కదారి పడుతున్నదన్నారు. తద్వారా ప్రజల్లో దీని వల్ల ఎలాంటి మంచి సందేశం వెళ్లడం లేదని అన్నారు. పండగ వచ్చినా.. పెళ్లి జరిగినా.. ఇంకా ఏ శుభకార్యమైనా ఇప్పుడు అందరికీ డీజే ర్యాలీలు తీయడం ఒక ఆనవాయితీగా మారింది. కుటుంబ సభ్యులతో, స్నేహితులతో సరదాగా డ్యాన్సులు చేస్తూ ఊరంతా తెలిసేలా హోరెత్తించడం ఇప్పుడు ఒక సంప్రదాయంగా మారింది. డీజే కొట్టు.. దుమ్ము రేపు అన్నట్లుగా ముఖ్యంగా యువకులు∙దీనికి బాగా ఆకర్షితులవుతున్నారు. కొందరు.. ఈ డీజే సౌండ్‌లతో చెవులకు చిల్లులు పడేలా నానా హంగామా చేస్తున్నారు. కానీ అది ఆ చుట్టుపక్కల వారికి ఇబ్బందికరంగా మారుతోంది. ఈ నేపథ్యంలోనే మజ్లిస్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. డీజే డాన్సులతో యువత చెడిపోతున్నారని, తద్వారా ప్రజల్లో దీని వల్ల ఎలాంటి మంచి సందేశం వెళ్లడం లేదని అన్నారు. అందుకే మతపరమైన ర్యాలీల్లో డీజేలపై నిషేధం విధించాలని తెలంగాణ ప్రభుత్వానికి ఒవైసీ విజ్ఞప్తి చేశారు.
డీజే సంస్కృతితో ఆధ్యాత్మిక వాతావరణం కలుషితం అవుతోందని అనడంతో పాటు మిలాద్ ఉన్ నబీ వేడుకల్లో భాగంగా చార్మినార్ వద్ద డీజే బాక్స్ పేలడంపై స్పందించారు. ఇది ఏ మాత్రం సమాజానికి పనికి వచ్చే చర్య కాదన్నారు. డీజే కావాలి అని కోరుకునే వాళ్లకు క్లబ్బులు, పబ్బులు లాంటివి సిద్ధంగా ఉంటాయని, అంతేకాని ఇలా నడిరోడ్డు మీద డీజే అంటూ పెట్టి ఇతరులకు ఇబ్బంది కలిగించేలా ప్రవర్తించడం సరికాదంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
చార్మినార్ వద్ద..
మిలాద్ ఉన్ నబీ వేడుకల సమయంలో చార్మినార్ వద్ద డీజే బాక్స్ పేలిపోయి పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. అప్రమత్తమైన స్థానిక అధికారులు ఆ మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు. డీజే పేరుతో కొంతమంది చేసే వికృత చేష్టలు, విన్యాసాలతో ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి. మరోవైపు, నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలంలో ఉరడీ మధు అనే యువకుడు డీజే శబ్దానికి గుండెపోటు వచ్చి మృతి చెందాడు. ఈ క్రమంలో ఎంపీ అసదుద్దీన్ డీజేను శాశ్వతంగా బ్యాన్ చేయాలని తెలిపారు. డీజే పేరుతో యువత హద్దులు మీరి ప్రవర్తిస్తోందని.. మతపరమైన కార్యక్రమాలే కాదు.. తెలంగాణలో డీజేకు అనుమతులు ఇవ్వొద్దని.. శాశ్వతంగా నిషేధం విధించాలని అసదుద్దీన్ తెలంగాణ ప్రభుత్వాన్ని కోరారు.