తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. లడ్డూ ప్రసాదంలో వినియోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వుల ఆనవాళ్లు ఉన్నట్లు ల్యాబ్ నివేదికలో తేలిందని సీఎం చంద్రబాబుతో పాటు టీటీడీ ఈవో వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే, ఈ వ్యవహారంలో కఠిన చర్యలు తీసుకోవాలనే డిమాండ్లు వ్యక్తమవుతున్నాయి.
తాజాగా ఈ అంశంపై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. సర్వోన్నత న్యాయస్థానం జోక్యం చేసుకోవాలంటూ ఓ లెటర్ పిటిషన్ దాఖలైంది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్‌కి సత్యం సింగ్ అనే న్యాయవాది లేఖ రాశారు. తిరుమల లడ్డూల తయారీలో ఉపయోగించే నెయ్యిలో జంతువుల కొవ్వులు ఉందని ల్యాబ్ నివేదికల్లో తేలిందని.. ఈ క్రమంలో సత్యసింగ్ విజ్ఞప్తి చేశారు.
గత టీటీడీ బోర్డు హయాంలో ప్రసాదంలో మాంసాహార ఉత్పత్తులను ఉపయోగించినట్లు బటపడిందని.. ఈ చర్య హిందూ మతపరమైన ఆచారాలు, ప్రాథమిక సిద్ధాంతాలను ఉల్లంఘించడంతో పాటు మత విశ్వాసాలపై దాడి చేసినట్లేనన్నారు. ప్రసాదంలో ఈ తరహాలో పదార్థాలు ఉపయోగించడం రాజ్యాంగంలోని ఆర్టికల్ 25(1) ప్రకారం రాజ్యాంగ పరిరక్షణపై దాడికి పాల్పడడమేనని.. ఆర్టికల్ 25(1) ప్రకారం అందరికీ మత స్వేచ్ఛ ఉంటుందని లేఖలో పేర్కొన్నారు. పవిత్ర నైవేద్యాన్ని మాంసాహారంతో కలుషితం చేయడం భక్తుల హక్కులను ఆలయ నిర్వాహకులు కాలరాయడమేనన్నారు. ప్రభుత్వం నియమించిన అధికారుల పర్యవేక్షణలోనే తిరుమలలో ఉల్లంఘన జరిగిందనే వాస్తవాన్ని దృష్టిలో ఉంచుకుని జోక్యం చేసుకోవాలని సత్యం సీజేఐని కోరారు.