సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం (సెప్టెంబర్ 20న) రోజున సచివాలయంలో నిర్వహించిన మంత్రి వర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. చెరువులు, కుంటలతో పాటు ప్రభుత్వ స్థలాలను అడ్డగోలుగా ఆక్రమించి.. అక్రమంగా నిర్మిస్తున్న కట్టడాలపై బుల్డోజర్లను ప్రయోగిస్తూ.. అక్రమార్కుల గుండెల్లో వణుకు పుట్టిస్తోన్న హైడ్రాకు.. విస్తృత అధికారాలు ఇస్తూ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. హైడ్రాకు చట్టబద్దత కల్పించే అంశంపై కూడా కేబినెట్ ఆమోదం తెలిపింది. హైదరాబాద్‌లో చెరువులు, కుంటలు, నాలాలు, ప్రభుత్వ ఆస్తుల పరిరక్షణకు ఏర్పాటు చేసిన హైడ్రాను బలోపేతం చేయడంతో పాటు.. వాల్టా చట్టంతో పాటు హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, మెట్రో వాటర్ బోర్డుకు ఇప్పుడున్న అధికారాలను హైడ్రా కమిషనర్‌కు అప్పగించాలని నిర్ణయించింది. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ (ఓఆర్ఆర్ లోపల ఉన్న హైదరాబాద్ సిటీ ఏరియా) పరిధిలో ప్రభుత్వ స్థలాలు, చెరువులు, కుంటలు, నాలాలన్నీ పరిరక్షించే బాధ్యతలను కూడా హైడ్రాకు అప్పగించాలని నిర్ణయించింది.
కోర్ అర్బన్ రీజియన్‌లో జీహెచ్ఎంసీతో పాటు 27 అర్బన్ లోకల్ బాడీస్, 51 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటిలో హైడ్రా కమిషనర్‌కు అవసరమైన అధికారాలు కల్పించేలా చట్ట సవరణకు కేబినేట్ ఆమోదం తెలిపింది. కోర్ అర్బన్ సిటీలోని అన్ని చెరువులు, కుంటలు ఆక్రమణలకు గురి కాకుండా సీసీ కెమెరాలతో నిఘా పెట్టి ఇంటిగ్రేటేడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌తో అనుసంధానం చేయాలని నిర్ణయం తీసుకుంది. హైడ్రాకు అవసరమైన దాదాపు 169 మంది అధికారులు, 946 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వివిధ విభాగాల నుంచి డిప్యూటేషన్ మీద నియమించుకునేందుకు అనుమతిని కల్పించనుంది.
మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాలివే..
1. హైడ్రాకు విస్తృత అధికారాలు ఇస్తూ కేబినెట్ నిర్ణయం
2. సన్న వడ్లకు రూ. 500 బోనస్ ఇవ్వాలని నిర్ణయం
3. కోఠి మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టాలని మంత్రివర్గం నిర్ణయం
4. తెలుగు విశ్వవిద్యాలయానికి సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టాలని మంత్రివర్గం నిర్ణయం
5. హ్యాండ్లూమ్ టెక్నాలజీ, ఇనిస్టిట్యూట్ కు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెట్టాలని మంత్రివర్గం నిర్ణయం
6. కోర్ అర్బన్ రీజియన్ లో హైడ్రా పని చేస్తుందని పేర్కొన్న కేబినెట్
7. 51 గ్రామ పంచాయతీలు హైడ్రా పరిధిలోకి వస్తాయని పేర్కొన్న కేబినెట్
8. ఆర్ఆర్ఆర్ ను ఖరారు చేసేందుకు 12 మందితో కమిటీని ఏర్పాటు
9. మనోహరాబాద్ మండలంలో లాజిస్టిక్ హబ్ కు కేబినెట్ ఆమోదం
10. ఎస్ఎల్బీసీ టన్నెల్ రివైజ్డ్ ఎస్టిమేట్ పనులకు కేబినెట్ ఆమోదం
11. టన్నెల్ పనులకు రూ. 4637 కోట్లు కేటాయిస్తూ కేబినెట్ నిర్ణయం