AMMA
NEWS
NETWORK

మా ఈ పేపర్ చదవండి :  

జానీ మాస్టర్‌ కోసం పోలీసుల గాలింపు.. బిగుసుకుంటున్న ఉచ్చు

(అమ్మన్యూస్, హైదరాబాద్‌):
లేడీ కొరియోగ్రాఫర్‌ పై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. పోలీసులు అతని కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. జానీ మాస్టర్‌ ప్రస్తుతం తన స్వస్థలం నెల్లూరులోనే ఉన్నాడన్న సమాచారంతో అక్కడి పోలీసులతో నార్సింగి పోలీసులు సంప్రదింపులు జరుపుతున్నారు. లైంగిక ఆరోపణలకు సంబంధించి డ్యాన్స్‌ మాస్టర్‌ కు నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు ఈ కేసులో బాధితురాలికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అలాగే బాధితురాలి స్టేట్‌మెంట్‌ రికార్డ్‌ చేశారు. ఆమె నుంచి ఇప్పటికే సఖి, భరోసా బృందాలు తగిన వివరాలు సేకరించాయి. ఈ కేసులో మరిన్ని ఆధారాలు సేకరించేందుకు నార్సింగి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

మరోవైపు ఈ కేసులో సంచలన విషయాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. మైనర్‌గా ఉన్నప్పటి నుంచే బాధితురాలిపై జానీ మాస్టర్‌ లైంగిక వేధింపులకు పాల్పడినట్లు ఆరోపణలు వస్తున్నాయి. అంతేకాదు మతం మార్చుకుని, పెళ్లి చేసుకోవాలని బెదిరింపులకు కూడా పాల్పడినట్లు వార్తలు వస్తున్నాయి.

చర్యలకు డిమాండ్‌..
మరోవైపు జానీ మాస్టర్‌పై చర్యలకు తెలుగు సినీ ఇండస్ట్రీ స్వరం పెంచుతోంది. ఇందులో భాగంగానే బాధితురాలికి ఓ స్టార్‌ హీరో అండగా నిలబడ్డాడని తెలుస్తోంది. అంతేకాదు ఆమెకు మద్దతు పలుకుతూ సినిమా అవకాశాలు కల్పిస్తానని భరోసా కూడా ఇచ్చాడని సమాచారం. అలాగే ఇతర నిర్మాతలు కూడా బాధితురాలికి అవకాశాలు ఇవ్వడానికి సిద్ధమవుతున్నారని సమాచారం. కాగా ఇప్పటికే బాధితురాలి ఫిర్యాదును టాలీవుడ్‌ విచారణ ప్యానెల్‌ రికార్డు చేసింది. జానీ మాస్టర్‌ లైంగిక వేధింపులకు సంబంధించి తమ వద్ద ఆధారాలు ఉన్నాయని ప్యానెల్‌ అంటోంది.

మరోవైపు జానీ మాస్టర్‌ కేసుకు సంబంధించి ఆందోళనలకు సిద్ధమవుతోంది బీజేపీ మహిళా మోర్చా. జానీని అరెస్ట్‌చేసి.. బాధితురాలికి న్యాయం చేయకపోతే పెద్దఎత్తున నిరసనలు చేస్తామని హెచ్చరించింది. ఇది లవ్‌ జిహాదే అంటోంది బీజేపీ మహిళా మోర్చా. హిందూ అమ్మాయిని ట్రాప్‌చేసి.. మతం మారాలంటూ బెదిరించిన జానీపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు.

అసలేం జరిగిందంటే?
ప్రముఖ కొరియోగ్రాఫర్‌ జానీ మాస్టర్‌ తనపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారంటూ యువతి ఫిర్యాదు మేరకు ఈనెల 16న రాయదుర్గం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. సెక్షన్‌ 376 రేప్‌ కేసుతోపాటు క్రిమినల్‌ బెదిరింపు (506), గాయపరచడం(323) క్లాజ్‌ (2) సెక్షన్ల కింద ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. అత్యాచారంతోపాటు బెదిరించి కొట్టాడంటూ బాధితురాలు తన ఫిర్యాదులో ఆరోపించింది.

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

ANN TOP 10