15 రోజుల్లో కూల్చివేయాలంటూ గడువు
రూ. లక్ష పరిహారం సైతం చెల్లించాలని తీర్పు
కేసీఆర్‌కు బిగ్ షాక్..
(అమ్మన్యూస్, నల్లగొండ):
బీఆర్‌ఎస్ పార్టీకి హైకోర్టు బిగ్ షాక్ ఇచ్చింది. ఆ పార్టీ తరఫున వేసిన పిటిషన్‌ను కొట్టేసింది. అంతేకాదు.. నల్లగొండ జిల్లాలోని ఆ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేయాలని ఆదేశించింది. ఇందుకోసం 15 రోజులు గడువు కూడా విధించింది.
నల్లగొండలో బీఆర్‌ఎస్ పార్టీ ఆఫీస్‌ను అక్రమంగా నిర్మించారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. ఎలాంటి అనుమతులు లేకుండానే ప్రభుత్వ భూమిలో పార్టీ కార్యాలయాన్ని నిర్మించారని తెలిపారు. ఈ అక్రమ కట్టడాన్ని కూల్చివేయాలంటూ మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు. అధికారులు సైతం బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని కూల్చివేసేందుకు సిద్ధమయ్యారు.
హైకోర్టును ఆశ్రయించినా..
మంత్రి ఆదేశాల నేపథ్యంలో.. బీఆర్‌ఎస్ పార్టీ అలర్ట్ అయ్యింది. హైకోర్టును ఆశ్రయించింది. పార్టీ కార్యాలయాన్ని రెగ్యులర్ చేసే విధంగా మున్సిపల్ శాఖ అధికారులకు ఆదేశాలివ్వాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటీషన్ ను పరిశీలించిన ధర్మాసనం.. పార్టీ కార్యాలయం కట్టిన తరువాత ఏ రకంగా అనుమతిస్తారని సూటిగా ప్రశ్నించింది. నిర్మించక ముందే అనుమతి తీసుకోవాలి కానీ, ఇప్పుడు ఎలా అనుమతి తీసుకుంటారని హైకోర్టు ప్రశ్నించింది. 15 రోజుల్లో పార్టీ కార్యాలయాన్ని కూలగొట్టాలంటూ మున్సిపల్ అధికారులను ఆదేశించింది. అంతేకాదు.. రూ. లక్ష పరిహారం చెల్లించాలని బీఆర్‌ఎస్ పార్టీని ఆదేశించింది.