– ఏదో సాధించామని సంబరపడుతున్నారు
– పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే అర్హత వారికి లేదు
– హైకోర్టు తీర్పుపై అధ్యయనం చేయాల్సిందే
(అమ్మన్యూస్, హైదరాబాద్):
పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు తీర్పు వెలువడిన నేపథ్యంలో ఈ తీర్పుపై సీనియర్ నేత, కాంగ్రెస్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి స్పందించారు. హై కోర్టు తీర్పు అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని, అవసరమైతే హైకోర్టు (డివిజన్ బెంచ్)ను ఆశ్రయిస్తామని అన్నారు. హైకోర్టు తీర్పు వెలువడగానే బీఆర్‌ఎస్ నాయకులు ఏదో సాధించామనుకుని చంకలు గుద్దుకుంటున్నారని, సంతోషపడుతూ ప్రకటనలు చేస్తున్నారని, పార్టీ ఫిరాయింపులపై మాట్లాడుతున్నారని, కానీ పార్టీ ఫిరాయింపులపై మాట్లాడే అర్హత ఆ పార్టీకి లేనే లేదని కడియం ఆగ్రహం వ్యక్తం చేశారు.
2014 నుంచి 2023 వరకు కాంగ్రెస్, సీపీఐ, వైఎస్సార్సీపీ, టీడీపీల నుంచి పెద్ద ఎత్తున పార్టీ ఫిరాయింపులకు బీఆర్‌ఎస్ పాల్పడడమే కాకుండా.. దానికి విలీనం అని కొత్త పేరు పెట్టి కొత్త నాటకాలు ఆడిందని విమర్శించారు. రాజకీయాలను భ్రష్టు పట్టించిందే బీఆర్‌ఎస్ పార్టీ అని, ఆ పార్టీ నేతల మాటలను ప్రజలు హర్షించరని కడియం మండిపడ్డారు.









